- గుర్తింపు సంఘం కాలపరిమితి 2 సంవత్సరాలు ఉండాలి
- సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించాలి
- సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణిలో అంతర్గత అభ్యర్థులకు నిర్వహించే రాత పరీక్షలు అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, పరీక్ష పత్రాన్ని తెలుగులో కూడా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహ రావులు అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ ధృవీకరణ పత్రం తీసుకోకుండా గుర్తింపు సంఘం కాలపరిమితి 2 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరాల కొరకు ప్రయత్నాలు చేస్తోందని, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా గుర్తింపు సంఘం కాలపరిమితి 2 సంవత్సరాలు ఉంచాలన్నారు. ఏఐటీయూసీ నాయకులు తమకు గుర్తింపు ధృవీకరణ పత్రం ఇవ్వ లేదని చెబుతూనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణిలో కూడా అన్ని సర్క్యులర్లు వెబ్ సైట్ లో పొందుపరచాలని అన్నారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్య బోధన అమలుకు యాజమాన్యం చొరవ తీసుకోవడం అభినందనీయమని, కార్మికులు తమ అభిప్రాయాలు తెలపడానికి మరికొంత సమయం ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థ సి అండ్ ఎండి ఎన్. బలరాం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడం హర్షణీయమన్నారు. సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించి, స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలన్నారు. కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బొగ్గు పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. మెడికల్ బోర్డు అవినీతి మయంగా మారిందని, డబ్బులు లేకుండా మెడికల్ ఇన్వాలిడేషన్లు జరగడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. మెడికల్ బోర్డులో అవినీతి నిర్మూలనకు గతంలో మాదిరి దరఖాస్తు చేసుకున్న కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కార్యదర్శి అంబాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ సాయిల్ల శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.