శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్‌కు హెచ్ఎంఎస్ నాయకుల వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని గనులలో విధులు నిర్వహిస్తున్న సర్వే సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి, వారి సీనియారిటీ ఆధారంగా గనులు, విభాగాలను కేటాయించాలని హెచ్ఎంఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి పొనగంటి అశోక్ మాట్లాడుతూ, ఏరియాలో పనిచేస్తున్న సర్వే మజ్దూర్లు, అసిస్టెంట్ చైన్ మెన్లు, చైన్ మెన్లు, హెడ్ చైన్ మెన్ల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా అండర్‌గ్రౌండ్ గనుల్లో శ్రమిస్తున్న కార్మికులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గత మూడేళ్లుగా అనుసరిస్తున్న కౌన్సెలింగ్ పద్ధతినే ఈసారి కూడా కొనసాగించాలని, దీనివల్ల పైరవీకారుల జోక్యానికి తావుండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పులి రాజేందర్, సర్వే విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.







