ఆర్.కె న్యూస్, నస్పూర్:
కార్మికుల సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూ టెక్ గని పై జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ సంఘం నాయకులు ఏనాడూ మాట్లాడలేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేసిన కనీసం సొంతింటి పథకం కోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని ప్రశ్నించారు. ఏరియర్స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మాట్లాడారని చెప్పే నాయకులు సంస్థకు రావలసిన బకాయిలు రాక ఆర్థికంగా నష్టపోతూ చివరికి ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి మారు పేర్లు సవరిస్తానని చెప్పిన ఇంతవరకు అమలు కాలేదని, 2011లో అలవెన్స్ ల పై ఐటీ మాఫీ ఒప్పందాన్ని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేస్తే అధికారులు అమలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతూ కూడా కార్మికులకు ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో టీబీజీకేఎస్ సంఘం చెప్పాలన్నారు. సిఐటియు నల్లబ్యాడ్జీలతో మొదలుపెట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు ఇతర సంఘాలు చేసిన నిరసనలతో యాజమాన్యం స్పందించి ఏరియర్స్ పై ప్రకటన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించే వరకు సింగరేణి నాయకులకు లాభాల గురించి ప్రకటన వస్తుందని తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సంస్థకు రావలసిన బకాయిలను ఇప్పించి లాభాల వాటా చెల్లింపు పై స్పష్టమైన తేదీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుల్ల బాలాజీ, గోదారి భాగ్యరాజ్, విడువల్లి శంకర్, వెంగళ శ్రీనివాస్, శ్రీపతి బాణేష్, అజయ్, ఆసంపల్లి అశోక్, పెరుక సదానందం, రాజయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
13 September 2023
ఇంటర్నెట్ లీడ్ పేర్లతో మాయమాటలు చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బియ్యాల ప్రశాంత్ అన్నారు. విద్యా అర్హత లేని టీచర్లతో పాఠశాల నిర్వహిస్తున్నారని, స్కూల్ లో బుక్స్, షూస్, సాక్స్, బెల్టు, ఐడి కార్డులను అమ్ముతున్న అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను తుంగలో తొక్కుతున్న లోటస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేనియెడల అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాధికారి కార్యాలయం ముట్టడికి వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాజు, ప్రశాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించిన, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడటంతో పాటు అభివృద్ధిలో జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 311 గ్రామపంచాయతీలు ముందంజలో ఉన్నాయని, భూముల విలువ పెరగడంతో కొందరు ఆక్రమణదారులు అక్రమంగా ప్రభుత్వ భూములలో చొరబడి తప్పుడు పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని నస్పూర్ మండలం నస్పూర్ గ్రామ శివారులోని 42, 64, 119, 52 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమ మార్గంలో సొంతం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని భావించి ఇదే అదనుగా కబ్జాలకు పాల్పడుతున్నారని, పట్టాలు ఉన్నాయని నమ్మబలికి ప్రభుత్వ భూములను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని, కొందరు ప్రహరీ గోడలు నిర్మించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ కొరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములపై ఎల్లవేళలా నిఘా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నస్పూర్ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కొరకు కేటాయించిన ప్రభుత్వ భూములపై క్రయ, విక్రయాలు లాంటివి జరపకూడదని, పట్టణాభివృద్ధి దృష్ట్యా గతంలోనే ప్రభుత్వ భూములపై భూ లావాదేవీలను నిషేధించడం జరిగిందని తెలిపారు. ఇకపై అక్రమ ఆక్రమణలకు పాల్పడిన వారిపై పి.డి. యాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో ఈ నెల 20, 25, 29 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించనున్న సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి బి. శేషాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ ధృవీకరణ పత్రం పొందుటకు అర్హులైన వారు మీ-సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదిలలో శిబిరానికి హాజరు కావాలని, ధ్రువీకరణ పత్రం కాలపరిమితి ముగిసి పునరుద్ధరణతో పాటు నూతన ధృవీకరణ పత్రం కొరకు అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 20న శారీరక వికలాంగులు-ఆర్థో (50 మంది), 25న కంటిచూపు (30), 29న మూగ, చెవుడు (50), మానసిక వికలాంగులు (50) అభ్యర్థులు సకాలంలో శిబిరాలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ సి.హెచ్.పి లో నిర్వహించిన గేట్ మీటింగ్ కు సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్కె సమ్మయ్య, బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ హాజరై మాట్లాడుతూ కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ 22ను గజిట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటిదాకా గెజిట్ చేయలేదన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో యాజమాన్యం ఆర్.ల్.సి సమక్షంలో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తక్షణమే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ లెక్కలను సరిచేసి, సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సాధించిన హక్కులు, చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సి.హెచ్.పి నుండి వివిధ కార్మిక సంఘాలకు చెందిన 35 మంది కాంట్రాక్టు కార్మికులు యూనియన్ లో చేరారు. వీరికి నాయకులు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కాతరాజు ప్రభాకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్.కె 5 గని పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ్ రావు, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కోశాధికారి పల్లె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పూణెలో ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశం.. రామమందిరం సహా దేశంలోని ప్రధాన సమస్యలపై చర్చ
Rashtriya Swayamsevak Sangh: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ కమిటీ మూడు రోజుల సమావేశం (సెప్టెంబర్ 14 నుంచి 16వరకు) గురువారం నుంచి పూణెలో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, సహ సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజేషన్ మంత్రి బీఎల్ సంతోష్‌తో సహా 36 సంఘ్ విభాగంలోని సంస్థలకు చెందిన 266 మంది అధికారులు హాజరవుతారు. ఈ సమావేశంలో రామమందిరం సహా దేశానికి, సమాజానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆర్ఎస్ఎస్ కు చెందన ప్రతి సంస్థ తన పని గురించి సమాచారాన్ని ఇవ్వడంతోపాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించనుంది. బుధవారం జరిగిన సమన్వయ సమావేశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత కొన్నేళ్లుగా సమాజంలో చురుగ్గా పనిచేస్తోందని, సంఘ్ వాలంటీర్లు తమ శాఖల ద్వారా దేశానికి నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. సంఘ్ వాలంటీర్లు శాఖలో పని చేయడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
సెప్టెంబరు 14 నుంచి 16 వరకు పూణెలో 36 సంఘ్ ప్రేరేపిత సంస్థల సమన్వయ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం సర్ పరశురాంభౌ కళాశాల క్యాంపస్‌లో జరగనుంది. చివరిసారి ఈ సమావేశం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.
దక్షిణ భారత దేశంలోనే ఏకైక బొగ్గు రంగ సంస్థ సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో దాదాపు 11 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ,కార్మిక సంఘాల ఐక్య పోరాటాల వలన, జాతీయ సంఘాల కృషి వలన 11 వ వేజ్ బోర్డులో సింగరేణి ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. కానీ, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపు, అపరిమిత ఉచిత వైద్య సౌకర్యాలు, కార్మికులకు, అధికారులకు గ్రాట్యుటీ 20 లక్షల సీలింగ్ అమలు పరిచే తేదీల్లో వ్యత్యాసం ఇలాంటి బొగ్గు విశ్రాంత కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా ఉంది. రాబోవు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పై సమస్యల ప్రభావం ఉంటుంది. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పై చర్చించి పరిష్కరించాలని సింగరేణి ప్రాంత శాసన సభ్యులను,పార్లమెంట్ సభ్యులను కార్మిక సంఘ నాయకులను విశ్రాంత ఉద్యోగులు వేడుకుంటున్నారు.
ఆళవందార్ వేణు మాధవ్
ఉపాధ్యక్షులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
టీస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రెంక రవి ఎన్నిక
టీస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన రెంక రవి ఎన్నికయ్యారు. యాదగిరి గుట్టలో నిర్వహించిన సమావేశంలో టీస్ఆర్టీసీ అద్దె బస్సు ల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వంగల రాజు, కోశాధికారిగా రాజు నాయక్, ఉపాధ్యక్షులుగా సంతోష్ నాయక్, వెంకటేష్, కుమార్, శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శ్రావణ్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, శ్యామ్, ప్రశాంత్, సలహాదారులుగా చందు, బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికయ్యారు. టీస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రెంక రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకుని, సింగరేణి వార్షిక క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు. సింగరేణి సంస్థ యువ యువ ఉద్యోగులతో కళకళలాడుతోందని, యువ ఉద్యోగులు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. త్వరలో క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. నెలలోపు ప్రగతి మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, నాగార్జున కాలనీ గ్రౌండ్ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్వోటు జీఎం రఘు కుమార్, డీజీఎం (పర్సనల్) అరవింద్ రావు, స్పోర్ట్స్ హానరి సెక్రటరీ పాలకుర్తి రాజు, స్పోర్ట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేష్, జనరల్ కెప్టెన్ గోపాల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుపై ఆ సెక్షన్లు చెల్లవు.. రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఈ రోజు కోర్టులో జరగనుంది. సరైన సాక్ష్యాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవనీ.. రాజకీయ ప్రతీకారంతోనే ప్రాథమిక సాక్ష్యాలు లేకపోయినప్పటికీ కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. దీనిపై హైకోర్ట్ విచారణ చేపట్టబోతోంది. మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉంటే.. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఇవాళ విచారించనుంది.