సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం సిహెచ్ పి రైల్వే సైడింగ్ మెయింటెనెన్స్ కార్మికులతో మాట్లాడుతూ, సకాలంలో జీతాలు చెల్లించేలా యాజమాన్యం కృషి చేయాలన్నారు. ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించాలని సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు వచ్చే అరకొర జీతాలు కూడా నెల చివరి వారంలో తప్ప ముందు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేసే పోరాట కార్యక్రమాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, బాపు, సది, సతీష్, వంశీ, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
14 September 2023
మత్తు పదార్థాల వినియోగం యువత భవితకు నిరోధకం- జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మత్తు పదార్థాలు, మద్యపానీయాల వినియోగం యువత భవిష్యత్తుకు నిరోధకమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి జిల్లా పోలీస్, విద్య, వైద్య, అటవీ, వ్యవసాయ, సాంఘిక, ఆదాయ పన్ను, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎన్.సి.బి. ప్రతినిధులతో మత్తు పదార్థాల నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, మత్తు పదార్థాలు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మంచి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా వ్యవసాయ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రి-హాబిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలలో ఒకరోజు ప్రజావాణి కార్యక్రమంలో మత్తు పదార్థాల నియంత్రణ పై సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, సి.ఐ. రాజు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, వినాయక విగ్రహాలు పెట్టదలచిన వారు ఆన్ లైన్ లో తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని, ఎలక్ట్రిసిటీ, మైక్ అనుమతులు తీసుకోవాలన్నారు. మండపం దగ్గర భద్రత చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు నిర్వాహకులు ఉండాలని సూచనలు చేశారు. నిమజ్జనం రోజు డీజే పెట్టొద్దని, మండపం వద్ద రాత్రి వేళలో మద్యం,పేకాట లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరమైతే 100 కి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఆపిల్ పండ్ల సాగులో కాశ్మీర్ తర్వాత రెండో స్థానం హిమాచల్ ప్రదేశ్ దే. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ పండ్లపై కేంద్రం సుంకం తగ్గించడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆపిల్ పండ్ల ధరలు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు చేయలేక హిమాచల్ ప్రదేశ్ రైతులు చెట్లను నరికి వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి గంజాయి మొక్కల పెంపకం కొరకు పరిమిత సాగుకై అనుమతి ఇచ్చే ప్రతిపాదన సమర్థనీయం కాదు. ఇప్పటికే దేశంలో అక్రమ మాదక, మత్తు పదార్థాల సేవనం వల్ల యువత చెడిపోతోంది. గంజాయిని మూర్ఛ, దీర్ఘకాల నరాల వ్యాధిగ్రస్తుల ఉపశమనం కొరకు ఉపయోగించే మందుల తయారీకి ప్రత్యేక పర్యవేక్షణలో వాడుతుంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఔషధ, శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం గంజాయి సాగు రైతులకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇదే అదనుగా నేరగాళ్లు దొంగచాటుగా అక్రమంగా గంజాయి సాగు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ పొరుగు రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువని జగమెరిగిన సత్యం. మరొక పొరుగు రాష్ట్రం గుజరాత్ లో ఉన్న ఓడరేవుల నుంచి అక్రమ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డ వైనం తెలిసిందే. పనామా, కొలంబియా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కొకైన్, హెరాయిన్, నల్ల మందు లాంటి మాదక ద్రవ్యాల మొక్కల పెంపకం వలన అక్కడి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు బాధపడుతున్నారు. ఇదే అదనుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి గంజాయి సాగు కొరకు రైతుల పేరిట శతృదేశం పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటు దారులు ప్రవేశిస్తే దేశ భద్రతకు ప్రమాద ముప్పు పొంచి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులను ఆదుకోవాలంటే గంజాయి సాగుకు అనుమతి ఇవ్వకుండా అక్కడి నేల, వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వేరే పంటకు అనుమతి ఇవ్వాలి తప్ప గంజాయి సాగుకు అనుమతి ఇవ్వరాదు.
ఆళవందార్ వేణు మాధవ్
హైదరాబాద్, 8686051752