మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్, దొరగారి పల్లె ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మండల తహశీల్దార్ భోజన్నతో కలిసి మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నపిల్లలు, వయోవృద్ధుల ఉల్లాసం కొరకు మున్సిపాలిటీలలో పార్కుల ఏర్పాటులో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని రాముని చెరువు, రామనగర్ ప్రాంతాల్లో చేపట్టిన పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నిర్వహణ పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
15 September 2023
అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
నస్పూర్ మండలంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు ఐ.సి.ఎస్.సి బోర్డ్ ఆఫ్ ఢిల్లీ పేరుతో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్ మేరీస్ ప్లే స్కూల్ పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని టి.బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాల నడుస్తున్న సమయంలో బిల్డింగ్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ లో గల నెక్స్ట్ జనరేషన్ స్కూల్ 60 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అగ్నిమాపక అనుమతులు, ఆట స్థలం లేవని, చీకటి గదుల్లో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పద్మశాలి కాలనీలోని ఎస్ఆర్ డిజి స్కూల్ ఆన్ లైన్ లో స్కూల్ యూనిఫామ్, టీ షర్ట్స్, స్టేషనరీ తీసుకోవాలని ఒక యాప్ క్రియేట్ చేసి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారన్నారు. సంబంధిత పాఠశాలల పై తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కె.వై.సి చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ తమ వివరాలు చౌకధరల దుకాణాలకు వెళ్లి తప్పనిసరిగా ఈ-కె.వై.సి. చేయించుకోవాలని, ఈ మేరకు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు లోని ప్రతి లబ్దిదారుడి వేలిముద్రలు, వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2 లక్షల 3 వేల ఆహార భద్రత కార్డులలో 5 లక్షల 92 వేల మంది లబ్దిదారులకు 29 వేల 782 క్వింటాళ్ళు, 15 వేల 490 అంత్యోదయ కార్డులలో 47 వేల 880 మంది లబ్దిదారులకు 4 వేల 975 క్వింటాళ్ళు, 160 అన్నపూర్ణ అన్న యోజన కార్డులలో 161 మంది లబ్దిదారులకు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగే బోడ కాకరకాయ పోషకాల గని అని అనడంలో అతిశయోక్తి లేదు. బోడకాకరనే అడవి కాకర, ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. శరీరంలో సరైన రోగ నిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే కూరగాయలలో బోడ కాకరకాయ ఒకటి. కూరగాయలు అన్ని వేళలా దొరుకుతాయి. కానీ, బోడ కాకరకాయ మాత్రం అన్ని సమయాల్లో దొరకదు. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు బోడకాకర మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పండే ఈ బోడ కాకరకాయ కి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ప్రస్తుతం కొంతమంది ఔత్సాహిక రైతులు బోడ కాకరకాయ పంట సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోడ కాకరకాయ విరివిరిగా లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది సీజన్ కూరగాయ అవ్వడం వలన దీని ధర మిగతా కూరగాయలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కాకరకాయ ప్రస్తుతం మార్కెట్లో కిలో 300 రూపాయల వరకు ధర పలుకుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరకడం, ఎటువంటి మందులు పిచికారీ చేయకపోవడం, ఔషధ గుణాలు మెండుగా ఉండడంతో ధర కాస్త ఎక్కువైనా బోడ కాకరకాయలను తినడానికి చాలామంది భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తారు.
– బోడకాకరతో భలే ప్రయోజనాలు… ఎన్నో వ్యాధులకు చెక్…
కేవలం ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ కాకరకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బోడకాకరలో పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని, ఇందులో బి1 ,బి2, బి3 వంటి విటమిన్లు అధికంగా ఉంటాయని బోడ కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బోడ కాకర కాయలు మాత్రమే కాకుండా ఈ చెట్ల వేర్లు, ఆకుల రసాన్ని కూడా వివిధ రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. బోడ కాకరకాయలు తినడం వల్ల పోషకాలు మన శరీరానికి అంది తీవ్రమైన తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బోడకాకరలోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. గర్భిణులు బోడ కాకర కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో బోడ కాకరకాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.
– మటన్, చికెన్ దండగ, బోడ కాకరకాయ ఉండగా…
మటన్, చికెన్ కంటే అత్యధిక పోషకాలు బోడ కాకరకాయలో ఉంటాయి. శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. చాలామంది శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో ఇంటికి బంధువులు వస్తే ప్రత్యేకంగా ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు.
– చికెన్ కంటే అధిక ధరకు అమ్ముడుపోతున్న బోడ కాకరకాయ
మార్కెట్లో కిలో చికెన్ ధర 200 రూపాయలు ఉండగా, కోలో బోడ కాకరకాయ ధర 300 రూపాయలు ఉన్నప్పటికీ బోడ కాకరకాయ విశిష్టత తెలిసినవారు మాత్రం కొనడానికి వెనకడుగు వేయడం లేదు.
జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య-ఆరోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది డెంగ్యూ వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రతి మున్సిపల్ పరిధిలో వైద్యాధికారులు సమీక్ష నిర్వహించుకొని ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సిబ్బంది ద్వారా స్ప్రే, పైరిత్రివ్, పారిశుద్ధ్యం, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ సిబ్బంది, బ్రీడింగ్ చక్కర్లు అనుసంధానం చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఆదివారం ఉదయం 10.10 గం||లకు ప్రతి ఇంటిలో డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలని, ప్రతి రోజు డ్రై డే కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు తమ గ్రామాలలో నిర్వహించనున్న కార్యక్రమాల కార్యచరణ రూపొందించాలని, వైద్య-ఆరోగ్య శాఖ ద్వారా వైద్యాధికారులు ప్రభావిత గ్రామాలను ప్రతి రోజు సందర్శించాలని, సబ్-యూనిట్ అధికారులు ప్రతి రోజు అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలను జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారికి అందించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాలని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ పై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కీటక జనిత వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతివారం వ్యాధుల ప్రభావం పై సమీక్ష నిర్వహించాలని, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ చర్యలపై పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డాక్టర్ అనిత, డాక్టర్ నీరజ, డాక్టర్ ఫయాజ్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అరవింద్, డాక్టర్ భీష్మ, 11 82, డాక్టర్ అశోక్, మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి.లు, సబ్-యూనిట్ అధికారులు, సూపర్వైజర్లు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. నారాయణ మూర్తికి తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. ఆర్. నారాయణమూర్తి శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని జీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏరియా జనరల్ మేనేజర్ నారాయణ మూర్తికి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ నారాయణ మూర్తి చిత్రాలు తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయని, తెలంగాణ నేపథ్యంలో ఆయన తీసిన పలు చిత్రాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్వోటు జీఎం కె రఘు కుమార్, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎంలు పి అరవింద రావు, చిరంజీవులు, ఆర్కే 5,6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, క్వాలిటీ మేనేజర్ కే వెంకటేశ్వర్ రెడ్డి, టిబిజికెఎస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి, స్టార్ట కంట్రోల్ అధికారి అమర్ నాథ్ రెడ్డి, ఎస్టేట్స్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
2వ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు తెలిపారు. శుక్రవారం నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలపై మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్.టి.ఆర్. నగర్ కాలనీలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్నతో కలిసి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో 18, 19 సంవత్సరాల వయసు నిండిన గిరిజనుల వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఓటు హక్కు విలువ, ఎన్నికల సమయంలో ఓటు వినియోగం ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీహరి, వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత, బదావత్ ప్రకాష్, బూత్ స్థాయి అధికారి రేణుక, తోటి, మన్నె డ్రైవ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హిందువులకు ప్రకృతిలో ఉన్న నదులు, సముద్రాలు, చెట్లు, పుట్టలను, విగ్రహాలను ఆరాధించే సంప్రదాయం అనాదిగా వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యత కలదు. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు “స్వాతంత్య్రం నా జన్మ హక్కు” అని గర్జించిన మరాఠా సింహం బాల గంగాధర తిలక్ ప్రజలను ఐక్యపరచి దేశ భక్తి, దైవ భక్తి చాటడానికి భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. రాను రాను ఈ ఆచారం మహారాష్ట్రలోనే కాకుండా ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రాకింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో నిలబెట్టే గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం ఎత్తు పెంచుకోవడం ఒక ఆకర్షణ. కాలమాన పరిస్థితులు మారి నేడు వీధి, వీధిన ఎక్కడ చూసిన పోటీ పడి మట్టి విగ్రహాలు స్థాపించే స్థానంలో కలుషిత రంగులతో కూడిన విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది. గణేష్ నవ రాత్రుల్లో ఉత్సవాల కమిటీ వారు బలవంతంగా భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయడం మంచి పద్ధతి కాదు. భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. రంగు విగ్రహాల్లో వాడే పదార్థాలలో మెర్క్యురీ, లెడ్ ఉండటం వలన ఆరోగ్యానికి చెడు ప్రభావం కలుగజేస్తాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం పెరిగి నీటి జీవరాసులతో పాటు ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ఈ విగ్రహాలను మురికి కాలువలు, చెత్త కుండీలు మధ్య కాకుండా, ప్రజలకు ఆటంకం లేని ప్రదేశాల్లో నిలబెట్టాలి. రాత్రి పూట కేవలం భజనలు, కీర్తనలు చేయాలి. అంతే కాని శబ్ద కాలుష్యకారకమైన డి.జె, మైకులు, సినీ పాటలు అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తే చంటి పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్ట్రీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలంకారం కొరకు వాడే విద్యుత్ తీగలు, బల్బులు ఉపయోగిస్తే ఒక్కొక్కసారి అధిక వోల్టేజ్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే అన్నదానం, నైవేద్యం తయారు చేసేటప్పుడు కల్తీ లేని నూనె, నెయ్యి, శుభ్రమైన కూరగాయలు వాడాలి. ఈ గణేష్ నవ రాత్రులలో భక్తజన సందడి ఎక్కువ కనుక డెంగ్యూ, మలేరియా సోకకుండా జాగ్రత్త వహించాలి.
———————————————————————————————————-
✍ ఆళవందార్ వేణు మాధవ్
8686051752, హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా మెగాస్టార్ కి చెల్లెలిగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన భోళా శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందిన భోళా శంకర్ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలని సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాలో శ్రీముఖి, సుశాంత్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, రవి శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు.