ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివాసం ఉంటున్న వారికి యాజమాన్య హక్కు కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఓ. నం.58, 59 ఒక వరమని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి జి.ఓ. 59 క్రింద దరఖాస్తు చేసుకున్న నస్పూర్ కు చెందిన లబ్దిదారులు వేముల రమేష్, కారపూరి రజిత, వసంతుల సురేష్ కు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివసిస్తూ భూముల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి జి.ఓ. 58, 59 క్రింద ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జి.ఓ. నం.59 క్రింద దరఖాస్తు చేసుకొని నోటీసు పొందిన వారు నిర్ణీత గడువులోగా ప్రభుత్వ రుసుము చెల్లించి పట్టా పొందాలని తెలిపారు.
17 September 2023
వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా చెరువు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని తెలిపారు. విద్యావంతులు, మేధావులు తమ వంతు బాధ్యతగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మట్టి వినాయక విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యమ్రంలో భాగంగా దాదాపు 200 కోట్ల మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఏర్పడి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 10 వేల సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాల ఉచిత పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విఘ్నాలకు అధిపతిగా పూజించే వినాయకుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల వెంకటాద్రి నగర్ లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నైజాం విముక్తి అమృతోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, రిటైర్డ్ టీచర్ గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నైజాం రాజుల పరిపాలనలో దేశ్ ముఖ్, జమీందారులు, భూస్వాములు చేసిన అరాచకాలు, స్త్రీల పై జరిగిన అత్యాచారాలు, నిజాం నిరంకుశ పాలనలో రజాకారులు చేసిన ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17 న నిజాం రాజు భారత దేశం లో విలీనం కాబడిన రోజున తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.రమణ మూర్తి, ఆకుల మల్లయ్య, సామాజిక కార్యకర్త గోవర్ధన్,సింగరేణి విశ్రాంత ఉద్యోగులు బీరయ్య, ప్రభాకర్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ జాతీయ సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి వెంకటేశ్వర్లు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐ లు, ఎస్. ఐ లు ఇతర వింగ్స్ చెందిన పోలీస్, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దేశ పురోభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్డ్ మూమెంట్) డాక్టర్ జే. ఆల్విన్ అన్నారు.
జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో తెలంగాణ తల్లి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సమైక్య భారతాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం సురేష్ మాట్లాడుతూ భారత దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం ఐటీ తదితర రంగాల్లో తన వంతు సహకారం అందిస్తూ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. సింగరేణి సంస్థ తగినంత బొగ్గు ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ ద్వారా రాష్ట్ర ప్రగతికి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, డీజీఎంలు ప్రదీప్ కుమార్, విజయేందర్ రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల:
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటాలకి పూలమాల సమర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సెప్టెంబర్ 17 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైఖ్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్ర అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వలసలతో తల్లడిల్లిన పాలమూరు కరువు నెలకు కృష్ణమ్మను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణ జలాల వాటాను పంచకుండా అన్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 1956లో ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రతో కలిపిందని, 1969లో 369 మంది యువకులను చంపిందని, 2004లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు బిఆర్ఎస్ పార్టీని చీల్చడానికి కుట్రలు చేసిందన్నారు. ఆనాడు సమైక్యవాదానికి మద్దతుగా నిలబడ్డ నేటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని అన్నారు. రేవంత్ రెడ్డి ధరణిని తీసేస్తామని, రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అంటున్నాడన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని, రాష్ట్రం అభివృద్ధి కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కెసిఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు రాహుల్, మోతిలాల్, మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్ నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ కార్యక్రమాల్లో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార పథకం”ను అక్టోబర్ 24 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించి, చదువుపై దృష్టి సారించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అల్పాహార పథకాన్ని అమలు చేయనుందని, ఈ పథకం ముఖ్యమంత్రి మానవీయ దృక్పథానికి అద్దం పడుతుందన్నారు. వ్యవసాయ కూలీలుగా ఉంటూ ఉదయాన్నే పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అర్థం చేసుకుని, గుర్తించి ఈ పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న పథకం పై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల ఐఏఎస్ అధికారుల బృందాన్ని పంపిన విషయం గుర్తుండే ఉంటుంది. విద్యార్థులకు అల్పాహార పథకం పై అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తమిళనాడులో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి, మానవతా దృక్పథంతో, ఖర్చు లేకుండా హైస్కూల్ విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూ. ఈ కొత్త పథకానికి ప్రభుత్వం ఏటా 400 కోట్లు ఖర్చు చేయనుంది.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు అన్నారు. దమ్మాయిగూడ లోని సిద్ధార్థ నగర్ సీనియర్ సిటిజన్ హాల్ లో శనివారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంపుదల, అపరిమిత ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేయాలని కార్యవర్గం తీర్మాణం చేసింది. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ సభ్యులుగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధిగా కొత్త కాపు లక్ష్మారెడ్డి లను నియమించడం పట్ల సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదల, వైద్య సౌకర్యాలు అపరిమితంగా కల్పించుటకు వీరు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి భూపెల్లి బానయ్య, కోశాధికారి ఎం. విజయబాబు, ఉపాధ్యక్షుడు ఆళవందార్ వేణుమాధవ్, విజయ్ బాబు, ఉమాకర్, బీరయ్య, రఫిక్, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.