మాసాంతంలోగా సి.ఎం.ఆర్. ప్రక్రియ పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో సి.ఎం.ఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 సీజన్ కు సంబంధించి బకాయి ఉన్న సి.ఎం.ఆర్ లక్ష్యాలను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి సీజన్ల ధాన్యాన్ని రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించిన లక్ష్యాల సి.ఎం.ఆర్.ను ప్రతి రోజు నివేదిక అందించాలని తెలిపారు. జిల్లాలోని ఆయా మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు 2023-24 వానాకాలం సంబంధించిన ధాన్యం కేటాయింపు జరుగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
21 September 2023
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నవరాత్రులు అనంతరం నిర్వహించనున్న నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వినాయక నిమజ్జనం కోసం జిల్లాలోని మంచిర్యాల పట్టణం, గుడిపేట గోదావరి తీరంతో పాటు దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నది తీరంలో గుర్తించిన ప్రాంతాలను జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, సబావత్ మోతిలాల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, మంచిర్యాల ఆర్.డి.ఓ. రాములు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18న వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 28న మిలాద్-ఉన్-నబి వేడుకలు ఉన్నందున ప్రజలంతా మత సామరస్యంతో పండుగలు సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. నవరాత్రుల అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
– నిధులు విడుదల చేసిన డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం
– అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కుల అందజేత
– దసరా, దీపావళి బోనస్ లు సకాలంలో చెల్లిస్తాం
– డైరెక్టర్ డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డు బకాయిలు 1450 కోట్ల రూపాయలు యాజమాన్యం గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆన్ లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్.బలరాం మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా ఎరియర్స్ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అన్నారు. తొలుత రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లించాలని భావించినప్పటికీ, సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు అనుకున్న సమయానికి కన్నా ముందే ఒకేసారి ఎరియర్స్ చెల్లింపుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. 11వ వేజ్ బోర్డు జీతాలు కూడా సింగరేణి సంస్థ కోల్ ఇండియా కన్నా ముందే అమలు జరిపిందని ఆయన గుర్తు చేశారు. 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ కోల్ ఇండియాలోని కొన్ని సబ్సిడరీ కంపెనీలు ఇంకా చెల్లించలేదని, దశలవారీగా చెల్లించడానికి సమాయత్తం అవుతున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ఒక్కసారిగా ఎరియర్స్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్ లో ఇన్ కంటాక్స్, సీఎంపిఎఫ్, పెన్షన్ కు చెల్లించవలసి ఉన్న సొమ్ము మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను దసరా పండుగకు ముందుగానే చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, పి.ఎల్.ఆర్ బోనస్ ను దీపావళి పండుగకు ముందే చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఎరియర్స్ బోనస్ చెల్లింపుల విషయంలో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారని, కార్మికులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అడగకముందే ఎరియర్స్, బోనస్ చెల్లింపును సింగరేణి తన బాధ్యతగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. పెద్ద మొత్తంలో ఎరియర్స్ పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వాడుకోవాలని, కుటుంబ భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమానికి సింగరేణి సంస్థ అంకితమై పని చేస్తుందని ఉద్యోగులు కూడా తమ పని గంటలు సద్విని చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని, ఇదే విధంగా మరిన్ని లాభాలు, సంక్షేమం అందుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో అత్యధిక ఎరియర్స్ పొందిన లచ్చయ్య, (రూ 6.97 లక్షలు) రవి బాబు (రూ.6.81 లక్షలు) సత్యనారాయణ రెడ్డి (6.69లక్షలు) లకు డైరెక్టర్ ఎన్.బలరాం, జిఎం కోఆర్డినేషన్ ఎం.సురేష్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్ వి.రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం హర్షణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సేవా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్, సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ చట్టసభలలో మహిళా బిల్లు ఆమోదం సంతోషకరమని, మహిళలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని అన్నారు. పార్లమెంట్ లో మహిళలకు ప్రాధాన్యం లభించడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, సీనియర్ పిఓ శ్రీ కాంతారావు, ఎస్టేట్స్ ఆఫీసర్స్ వరలక్ష్మి, స్వప్న, లా ఆఫీసర్ ప్రబంధిత, జనరల్ మేనేజర్ కార్యాలయ మహిళా ప్రతినిధి ఆకుల అఖిల, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు శారద, రజిత, జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఉద్యోగులు ఏ. రాజమల్లు (ఎలక్ట్రిషన్), కమలాకర్ రావు ( షార్ట్ ఫైరర్) లకు ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి 11వ వేజ్ బోర్డు 23 నెలల ఏరియర్స్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలైన 11వ వేజ్ బోర్డు 23 నెలల ఏరియర్స్ జీతాలను సింగరేణి యాజమాన్యం నేడు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఆర్కే-7 గనికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా ఏరియర్స్ జీతాలు రావడం సంతోషకరమని అన్నారు. ఉద్యోగులు ఏరియర్స్ జీతాల నగదు మొత్తాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, విధులకు హాజరయ్యే క్రమంలో ఉద్యోగులు హెల్మెట్లను ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రక్షణ మన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని అన్నారు. ఉత్పత్తి సాధనలో ఉద్యోగులు, అధికారులు ఒకటిగా పని చేసి, వార్షిక లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి కొట్టే కిషన్ రావు, హెచ్ఎంఎస్ ఏరియా సెక్రటరీ రాజేంద్రప్రసాద్, ఐఎన్టియుసి జాతీయ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజు, బిఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి నాతడి శ్రీధర్ రెడ్డి, అర్కే-7 గ్రూప్ ఏజెంట్ ఎం. రాముడు, డివైజియం (పర్సనల్) పి. అరవింద్ రావు, గని మేనేజర్ సాయి ప్రసాద్, గ్రూప్ ఇంజనీర్ రాజా రవి చరణ్, సీనియర్ పిఓ కాంతారావు, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రెటరీ మెండె వెంకటి, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, లక్ష్మణ్, శశాంక్ సాయి, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీశ్వర్ రావు, సంక్షేమ అధికారి పాల్ సృజన్ ఇతర అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుల పాలిట శాపం అల్జీమర్స్
మానవ మెదడులో దాదాపు 100 బిలియన్ల నాడీ కణాలు,ఇతర కణాలు ఉంటాయి. ఈ కణాలు ఆలోచించడం, మాట్లాడటం, నేర్చుకోవడం, శరీర భాగాలను నియంత్రిస్తాయి. కానీ, వయస్సు పెరిగే కొద్దీ వృద్ధుల్లో జ్ఞాపక శక్తి నశించి మతిమరుపు లాంటి లక్షణాలు పెరుగుతాయి. సహజంగా మతిమరుపు వలన ఒక వస్తువు పెట్టిన చోటు మరవడం, బయటకు వెళ్లిన వారు తమ ఇంటి చిరునామా మరచి తికమక పడటం, తమకు తెలిసిన వారిని గుర్తుపట్టక పోవటం, పొంతన లేని సంభాషణ, తమకు తెలియకుండానే వ్యక్తుల మధ్య బట్టలు మార్చుకోవడం లాంటి చర్యలు చేబడుతుంటారు. ఇలాంటి వారిలో తీవ్రమైన గందరగోళం,నూతన పద్ధతులు నేర్చుకోవడంలో తడబాటు, చదవటం, వ్రాయటంలో అక్షరాలు మరచి పోవడం, ఒక్కోసారి విపరీత ధోరణితో ప్రవర్తిస్తారు.ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి “అల్జీమర్స్” మానసిక వ్యాధి ఉందని తెలుసుకోవాలి. అల్జీమర్స్ మొదటి కేసు 1901లో జర్మన్ మానసిక వైద్యుడు”అలోయుస్ అల్జీమర్” చేత 50 ఏళ్ల జర్మనీ మహిళలో నిర్ధారణ అయ్యింది. ఈ రుగ్మతకు “అలోయుస్ ఆల్జీమర్” అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులు 2.4 కోట్ల మంది ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 13.5 కోట్ల మంది గురై పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అల్జీమర్స్ ఉన్న దేశం ఫిన్ లాండ్. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 55 మంది అల్జీమర్స్ తో బాధ పడుతున్నారు. అల్జీమర్స్ తో బాధ పడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత తృతీయ స్థానంలో భారతదేశం ఉంది. ఈ వ్యాధి లక్షణం పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ. ప్రజల్లో అల్జీమర్స్ వ్యాధి పై అవగాహన పెంచేందుకు “అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్” వారు 1994లో ఎడన్ బర్గ్ లో “ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 21”న ప్రకటించారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా యుక్త వయస్సు నుంచే తగు జాగ్రత్తలు పాటించాలి. నీరు ఎక్కువగా త్రాగడం, ధూమపానం, మద్యపానం సేవించక ఉండటం, శారీరక వ్యాయామం చేయడం, ధ్యానం వంటివి చేయాలి.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్