విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 4 మండలాలలో గల 55 ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలో డెమో స్కూల్ ప్రోగ్రాం కొరకు ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయితీ కార్యదర్శులు, కస్తూరిబా గాంధీ విద్యాలయం అధికారులు, ప్రత్యేక అధికారులతో 100 రోజుల డెమో స్కూల్ ప్రోగ్రాం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులను గ్రూపులుగా తయారుచేసి వారి ఆలోచనలను ఇతర విద్యార్థులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాలల్లో అసెంబ్లీ, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభతరమైన పద్ధతుల్లో విద్యాబోధన చేయాలని తెలిపారు. పిరమిడ్ సభ్యుల సహకారంతో 100 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలని, ప్రారంభ, మధ్య, అంత్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం డెమో స్కూల్ కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
22 September 2023
మంచిర్యాల జిల్లాలో మన ఊరు మన బడి, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో 248 పాఠశాలలు ఎంపిక చేయబడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, శౌచాలయాలు, భోజనశాల, వంటశాల, ప్రహారీ గోడల నిర్మాణం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులతో పాటు మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని, ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ క్రమంలో పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చేసే దిశగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు శాశ్వత భవనాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల భాగంగా 135 గ్రామపంచాయతీల భవనాలు మంజూరు చేయబడి 89 పనులు ప్రారంభించి కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు ముస్త్యాల అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీలక్ష్మి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, రామగిరి బాలరాజు, క్యాతం రాజేష్, గోపతి తిరుపతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు ఫణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంకాలం పూజ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నారు.
ఏరియర్స్ డబ్బులలో ఆదాయపు పన్ను రికవరీలు చూసి కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజ్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గని కార్మికులను కలిసి ఏరియర్స్ పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ మాట్లాడుతూ ఏరియర్స్ డబ్బులలో ఆదాయపన్ను పేరిట ఎంత శాతం కోతలు వేశారో ఇచ్చిన చిట్టీలలో స్పష్టంగా లేదన్నారు. 23 నెలల వివరాలతో కూడిన చిట్టీలు అందించాల్సిన యాజమాన్యం కేవలం మొత్తం ఆదాయపు పన్ను రికవరీ, వచ్చే డబ్బుల వివరాలు మాత్రమే ఇవ్వడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కార్మికుల్లో అనుమానాలు తొలగించేందుకు 23 నెలల ఏరియర్స్ కు సంబంధించిన వివరాలతో కూడిన చిట్టిలను అందించాలని, పూర్తి వివరాలతో ఉన్న చిట్టీలు కొన్ని గనులపై ఇస్తూ మరికొన్ని గనులపై ఇవ్వకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కార్మికులందరికీ పూర్తి సమాచారంతో ఉన్న చిట్టీలు ఇవ్వాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. ఏరియర్స్ డబ్బులలో క్వార్టర్ ఉన్న కార్మికులకు ఎక్కువ రికవరీ అవుతుందని, ఇప్పటికైనా 2011లో కోల్ ఇండియాలో చేసుకున్న వేతన ఒప్పందం ప్రకారం అలవెన్సు లపై ఆదాయపు పన్ను మాఫీ ఒప్పందాన్ని అమలు చేయాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డర్ లో సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చి ఎన్నికల్లో ఓట్లు దండుకుంటున్న ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను రద్దు పై పార్లమెంట్ లో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ఈనెల 24న హైదరాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సామాన్యుడి సమరభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మాల్వియా నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ సోమనాథ్ భారతి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఈ సభను తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బహిరంగ సభ వేదికగా ప్రజలకు తెలుపుతామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తేనే స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి అందుతాయని, రాజకీయ విప్లవంలో సామాన్య ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ నల్ల నాగేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ నయీమ్ పాషా, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ కొంటు రాజు, నాయకులు పల్లికొండ సంజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.