102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయం
ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్
సింగరేణి సంస్థ ఉద్యోగుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్.కె 7 గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గని మేనేజర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ఆర్కే-7 గని 102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని, రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గడిచిన 6 మాసాల్లో గనిలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదని, ప్రమాద రహిత గనిగా ఆర్కే-7 గని ముందుందని, రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అభినందించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విధులు నిర్వహించాలని, భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల రక్షణకే సింగరేణి సంస్థ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణ పై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, మన రక్షణ ఇంటి నుండే మొదలవుతుందని విధులకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా బైకులపై హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, శ్రీనివాస్, రాజు, సంక్షేమ అధికారి సంతన్, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ మెండె వెంకటి, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ బీర రవీందర్, ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీధర్, బిఎంఎస్ ఫిట్ సెక్రటరీ మహేందర్, హెచ్ఎంఎస్ ఫిట్ సెక్రటరీ రాజేందర్, సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
3 October 2023
– రాబోయే ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని, సింగరేణి సంస్థ రాజకీయ నాయకుల చేతిలో బందీగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాజకీయ జోక్యంతో ఆర్థిక దోపిడీ పెరిగి సంస్థ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 1998కి ముందు ఏఐటీయూసీ అడగలేదని కొన్ని యూనియన్ల వల్ల సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం పెరిగి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి దాదాపు 29 వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని వాటిని ఇప్పటివరకు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికుల జీతాలు ఏరియర్స్ చెల్లింపుల కోసం యాజమాన్యం బ్యాంకుల చుట్టూ యాజమాన్యం తిరగాల్సి వస్తోందని ఆరోపించారు. అధికారుల కంటే కార్మికులకు 11వ వేజ్ బోర్డు ఒప్పందం వల్ల కార్మికుల జీతాలు అధికారుల జీతం కంటే ఎక్కువ పెరిగాయని ఇది డిపిఈ గైడ్ లైన్స్ కు వ్యతిరేకమని కోల్ ఇండియాలోని అధికారుల సంఘం జబల్పూర్ హైకోర్టులో కేసు వేయడంతో అక్కడి కార్మికులకు జీతాలు చెల్లింపు నిలిపారని, అధికారుల సంఘం వెంటనే కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ సంఘాలు ఈనెల 12, 13, 14 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందని , ఈ కోర్టు కేసులో సింగరేణి పార్టీ కాలేదని, కార్మికుల జీతాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. కోర్టు తీర్పు మేరకు గత నెల 27న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారని, షెడ్యూల్ ప్రకారం యాజమాన్యం ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం ఏఐటీయూసీని గెలిపించాలని, సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు మోహన్ రెడ్డి, నర్సింగ రావు, ఇతినేని శంకర్, సత్తయ్య, గండి సతీష్, సుధాకర్, సుభాష్, భీమయ్య, దొడ్డిపట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిసిసి నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లి సమీపంలోని నేషనల్ హైవే, రైల్వే ట్రాక్ సమీపంలోని నాలా పక్కన సుమారు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. మృతుడు చిన్న టవల్ ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.
✅ శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
మానవ జీవితంలో అన్నింటి కంటే విలువైనది ఆరోగ్యమేనని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ సీఎంవో డాక్టర్ పి రమేష్ బాబుతో కలిసి ఆర్కే 8 డిస్పెన్సరీలో గుండె సంబంధిత వ్యాధుల పై అవగాహన, కరపత్రాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా వ్యాయామం, నడక, యోగ లాంటి అంశాలు ఉండేలా చూసుకోవడంతో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, కొద్ది దూరానికి వాహనాలు వినియోగించకుండా నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచుకుంటూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ.కె 5, 6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, డాక్టర్లు వేదవ్యాస్, మురళీధర్, లోకనాథ్ రెడ్డి, స్వప్న, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు
నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్కే-న్యూటెక్ గని ఆదర్శంగా నిలుస్తుందని గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు అన్నారు. మంగళవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో ఆర్కే-న్యూటెక్ గని 105 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, ఇందుకు కృషి చేసిన గని ఉద్యోగులు, సూపర్వైజర్లు, తోడ్పాటు అందించిన కార్మిక సంఘాల నాయకులను అభినందించారు. రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పని చేసే ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. కంపెనీ వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, వెంటిలేషన్ అధికారి శంకర్, ఇంజినీర్ కృష్ణ, జేఓ స్లాన్లీ జోన్స్, అండర్ మేనేజర్లు సాత్విక్, చంద్రమౌళి, తెబొగకాసం పిట్ కార్యదర్శి జంపయ్య, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి మహేందర్, బీఎంఎస్ ప్రతినిధి వినయ్ కుమార్, హెచ్.ఎం.ఎస్ పిట్ కార్యదర్శి సురేందర్, సీఐటీయూ పిట్ కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.