– కార్యకర్తలు నా బలం
– టిపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని టిపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం నస్పూర్ పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశా, నిర్దేశం చేశారు. ప్రజలు చూపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములకు అతీతంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన గడ్డపై మమకారంతో రాజకీయాలకు వచ్చానే తప్ప డబ్బు సంపాదించడానికి కాదని స్పష్టం చేశారు. కార్యకర్తలే తన బలమని, పార్టీ 6 గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలు వస్తేనే అధికార పార్టీ నాయకులకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని హడావుడిగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని అన్నారు. భారాస నాయకులు డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గత 20 సంవత్సరాలు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. గతంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత తమదేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచిర్యాల, నస్పూర్ పట్టణాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచి నీటి సరఫరాతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. సింగరేణి నిధులను బిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఎన్నికల తరువాత ఓసీపి లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భారాస వలస వాదులను తరిమేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చిట్ల సత్యనారాయణ, పిసిసి సభ్యులు కొండ చంద్రశేఖర్, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు, రామగిరి బానే ష్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిళ్ల వేణు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Daily Archives