మచ్చలేని నాయకుడు, నిజాయితీగల వ్యాపారి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పై ఐటీ దాడులు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకట స్వామికి వస్తున్న ప్రజాధారణ చూసి భయపడిన అధికార పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గలలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మాల మహానాడు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సాధికారత, అభివృద్ది కోసం దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని చిత్తశుద్దితో అమలు చేసిందని, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే దళితులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలు మధ్యలో వదిలివేస్తూ మోసం చేసిందన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొత్త పథకం తెరపైకి తెస్తూ, దళితులను వంచిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి మల్లయ్య, నాయకులు పొట్ట మధుకర్, దమ్మ నారాయణ, మినుముల శాంతి కుమార్, బైరం రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
22 November 2023
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, సీసీసీ కార్నర్ బస్ స్టాప్ వద్ద పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన, అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తులు బుధవారం అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు గుడ్డేటి రామలింగంల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు గోదావరి పుణ్య స్నానం ఆచరించి, అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యలుచే అయ్యప్ప మాల ధరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు దీక్ష నియమాలు ఉపదేశించి నిష్టగా 41 రోజులు అయ్యప్ప స్వామి పూజలు చేసి ఇరుముడి దాల్చి శబరిమల వెళ్లాలని కోరారు. అయ్యప్ప స్వామి దీక్షతో భక్తులకు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న గురువారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో కేరళకు చెందిన సంజీవ నంబూద్రి గురుస్వామిచే అయ్యప్ప స్వాముల సామూహిక మహా పడిపూజ, అయ్యప్ప స్వాముల మహా సంగమం, అగ్ని గుండాల ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వంగ శ్రీనివాస్, సీహెచ్ సదానందం, వేణు, కొండల్ రెడ్డి, శ్రావణ్, బన్నీ, శేఖర్, బజ్జూరి, సురెందర్, రమేష్, చందర్, పప్పు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.