ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాలలో సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారిగా బదిలీపై వెళ్ళిన యాట్ల సంపత్ కుమార్ జిల్లాలో అందించిన సేవలు అభినందనీయం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ రకాల ప్రచార పద్దతులలో ప్రజలకు చేరవేయడంలో జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నికల సమయంలో అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తూ ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విభాగం నుండి ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో విజయవంతం అయ్యారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళుతున్న యాట్ల సంపత్ కుమార్ ను కార్యాలయ సిబ్బంది, వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి వీడ్కోలు పలికారు.
16 February 2024
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి రావాలని కోరుకుంటూ నస్పూర్ పట్టణంలోని ఆర్కే 5 కాలనీ బ్యారెక్స్ లో గల జామే మసీదులో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామే మస్జీద్ అధ్యక్షులు మొహమ్మద్ మౌలానా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంద్రవెల్లిలో నిర్వహించిన ఎన్నికల సమర శంఖారావ సభను విజయవంతం కావడానికి ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు కృషి ఫలితంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తమకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు గెలుపుకు తమ వంతు కృషి చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవులతో పాటు అనేక వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారన్నారు. ఈ హామీలన్నీ అమలు కావాలన్నా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని ముస్లిం సోదరులందరూ ఆశిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టిన గత 10 సంవత్సరాల నుండి మంచిర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో నీటి ఎద్దడి తీర్చడానికి ప్రత్యేక ట్యాంకర్లు పెట్టి నీరు ఇచ్చిన ఘనత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కే దక్కుతుందన్నారు. రంజాన్ మాసం, దసరా పండుగ వచ్చిందంటే కొక్కిరాల సురేఖమ్మ ఆడపడుచులకు ఇచ్చిన చీరలు మరిచిపోనివని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జామే మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు. మందమర్రి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాన్ లో మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు టేకు కనకయ్యను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ సిబ్బందికి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఈనెల 18న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నస్పూర్ పట్టణంలోని మనోరంజన్ సముదాయంలో డాక్టర్ విశ్వనాథ మహర్షి ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం (పర్సనల్) పి అరవింద రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని శ్రీ ముక్కిడి పోచమ్మ గుడి ఆవరణలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ ముక్కిడి పోచమ్మ గుడి దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడానికి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జాతర సమయంలో వైద్య సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. సింగరేణి ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, ఏరియా వర్క్ షాప్ ఎస్.ఈలు మల్లయ్య, సతీష్ చక్రవర్తి, సీనియర్ పీవో పి. కాంతారావు, ఆలయ పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.