ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణానికి చెందిన అంబాల రాజ్ కుమార్ కు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్ అండ్ సోషల్ జస్టిస్ చేంజ్ ఫర్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఉత్తమ పౌర సేవా పురస్కారాన్ని అందజేశారు. బుధవారం స్థానిక సృష్టి ఇన్స్టిట్యూట్ లో సంస్థ మంచిర్యాల జిల్లా ఇంఛార్జి గోదారి వెంకట సాయి ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్, సిసిసి నస్పూర్ ఎస్.ఐ రవికుమార్ లు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో అంబాల రాజ్ కుమార్ చేస్తున్న సేవలకుగాను ఉత్తమ పౌర సేవా పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ళ ఉపేందర్, స్టేట్ కమిటీ మెంబర్ ప్రభాకర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయిని స్వామి, మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సాయి కుమార్, జిల్లా సభ్యులు అరుణ్ తేజ, నీలం సురేందర్, చెన్నూర్ మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
20 March 2024
● శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గని నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని 10 రోజులు ముందస్తుగా సాధించడం హర్షణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ 100 శాతం ఉత్పత్తి సాధించినందుకు గని ఉద్యోగులు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న 24 భూగర్భ గనుల్లో రెండు భూగర్భ గనులు మాత్రమే తమ వార్షిక నిర్దేశిత లక్ష్యాలను సాధించాయని, అవి కూడా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్.కె 5, ఆర్.కె 6 గనులు కావడం చాలా సంతోషకరమని, రాబోవు ఆర్థిక సంవత్సరంలో కూడా ఉద్యోగులు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు గని ఏజెంట్, మేనేజర్ ఎల్లవేళలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత చేయడంలో గని ఉద్యోగులు, అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించారని, గత మూడు సంవత్సరాలుగా తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆర్.కె 5, ఆర్.కె 6 గనులు ముందుంటున్నాయని గుర్తు చేశారు. తదుపరి గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల నిబద్ధత, ఉత్పత్తి లక్ష్య సాధనలో గుర్తింపు సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాల సంపూర్ణ సహకారంతోనే ఇదంతా సాధ్యం అయ్యిందని అన్నారు. గని మేనేజర్ ఎం.డి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్.కె 5 గనికి నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సమిష్టి కృషితో 11 నెలల 20 రోజుల్లోనే అధిగమించినట్లు తెలిపారు. 100 శాతం ఉత్పత్తి సాధించడమే కాక మెరుగైన ఓ.ఎం.ఎస్ శాతం సాధించినందుకు ఉద్యోగులను, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి ఇ.శివయ్య, పిట్ ఇంజనీర్ వి.రాధాకృష్ణ, గని సంక్షేమాధికారి బి.రణదీప్ గౌడ్, ఇతర అధికారులు, ఆర్.కె 5 గని పిట్ సెక్రటరీ జి నర్సింగ రావు, ఏరియా సెక్రటరీ ఎం.ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత
* మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను రాజీ పడపోనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తేల్చి చెప్పారు. బుధవారం తన నివాసంలో మంచిర్యాల ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంచిర్యాలలో తాగునీరు సమస్య భవిష్యత్తులో ఉండబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాలలో అదనంగా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గోదావరి పై వంతెన నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని, వంతెన ముల్కల్ల ప్రాంతంలో నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాలేజ్ రోడ్ నుంచి అంతర్గాం వరకు బ్రిడ్జి నిర్మాణం కేవలం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కోసమేనని, తాను స్వార్థంతో కాకుండా ప్రజల సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓర్వలేని దివాకర్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చకొట్టడం శోచనీయమన్నారు. ఆటో డ్రైవర్లకు తాను సొంతంగా జీవిత బీమా చేయించానని గుర్తు చేశారు. కాళేశ్వరం వల్ల మంచిర్యాల వరద ముంపుకు గురైతే కనీస సాయంగా పదివేలు కూడా ఇప్పించ లేదని దివాకర్ రావు పై విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యే కాగానే కరకట్ట నిర్మాణంకు 270 కోట్లు మంజూరు చేయించానని వెల్లడించారు. ఐబీ స్థలంలో ఎన్నికల కోడ్ ముగియగానే మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న డంప్ యార్డు సమస్య పరిష్కారం చూపానని, సింగరేణి స్థలంలో డంప్ యార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం జారీ చేసిన ఇండ్ల పట్టాలు రద్దు చేసి స్థలంపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. తపాలపూర్ నుంచి లక్షెట్టిపేట చౌరస్తా వరకు నాలుగు వరుసల రోడ్ మంజూరైందన్నారు. తరుగు పేరుతో రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి పైసా కక్కిస్తానని అన్నారు. చిత్తశుద్ధి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.