- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూత అందించాలి
- తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: రాజ్యాధికారంతోనే కుల సంఘాలు బలోపేతం అవుతాయని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనివారం మంచిర్యాలకు వచ్చారు. మంచిర్యాల పట్టణంలోని ఓ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీల స్థితిగతులు పరిశీలించడంతో పాటు రాజకీయ చైతన్యం పెంపొందించడానికి జిల్లాల పర్యటన చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో పద్మశాలీలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలు గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూత అందించాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్న భీమాకు సంబంధించిన 6 కోట్ల రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి వారికి అందిచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మంచిర్యాల జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పద్మశాలి యువత విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. యువత సేవా దృక్పథం, పోటీతత్వం అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో పద్మశాలీల బలోపేతానికి కృషి చేస్తున్న పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. ఈ మేరకు వారికి ధృవ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రాంచందర్, కోశాధికారి బొమ్మ రఘురాం, కార్యదర్శి చిలువేరు సదానందం, యూత్ అధ్యక్షులు అవ్వారి భాస్కర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గాదాసు బాపు, గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, యూత్ అధ్యక్షులు బింగి ప్రవీణ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాం సత్తయ్య, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.