ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు మంగళవారం నస్పూర్ పట్టణంలోని శ్రీ రెయిన్ బో స్కూల్ లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు రాధా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సంప్రదాయ రీతిలో వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లు చెన్నూరి అమన్ ప్రసాద్, చెన్నూరి మానసలు మాట్లాడుతూ తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం బతుకమ్మ పోటీ నిర్వహించి, విజేతకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిని, సుధా రావు, సుధా రాణి, ఉపాధ్యాయిని బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
1 October 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని వానమాములై సత్యనారాయణచార్యులు 1984వ సంవత్సరంలో శ్రీరాంపూర్ ప్రాంతంలో స్థాపించబడిన శ్రీ భగత్ సింగ్ విద్యా మందిర్ లో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆదివారం నస్పూర్ లోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. తొలుత తమతో చదువుకొని మరణించిన స్నేహితులను గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తదుపరి ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ తమ గత జ్ఞాపకాలను, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వయస్సును మరచి విద్యార్థి దశలోకి వెళ్లి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. పిదప సహపంక్తి భోజనాలు చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలిసి చదువుకున్న మిత్రులందరూ ఒకచోట కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మిత్రులతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తాం
- గుర్తింపు సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జెన్ కో, ట్రాన్స్ కోలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిందని, గత ప్రభుత్వ హయాంలో బొగ్గు అమ్మిన రూపాయలు 12 వేల కోట్లు, విద్యుత్ సరఫరా చేసిన రూపాయలు 17 వేల కోట్ల రూపాయలు సింగరేణి కి చెల్లించకుండా 29 వేల కోట్ల రూపాయల బకాయి ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగువేల కోట్ల వరకు బకాయిలు పడిందని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోతుందని, తద్వారా కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ, అభివృద్ధి, మిషనరీ కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వమే అని చెప్పుకు తిరిగే ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి సంస్థ మనుగడకు, విస్తరణకు సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు అవినీతికి తావు లేకుండా కార్మికులకు రావాల్సిన ప్రమోషన్స్, బదిలీలు పారదర్శకంగా చేస్తున్నామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని, కార్మికుల్లో ఏఐటీయూసీకి ఉన్న ఆదరాభిమానాలు చూడలేక కొన్ని కార్మిక సంఘాలు వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నాయన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కొరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సంపత్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు గజ్జి రమేష్, చంద్రశేఖర్, సిద్ధం అజయ్, తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ ఉత్పత్తి ,ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో ఆర్కే5 గని 89 శాతం, ఆర్కే6 గని 106 శాతం, ఆర్కే7 గని 72 శాతం, ఆర్కే న్యూటెక్ గని 101 శాతం, ఎస్సార్పీ 1 గని 68 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 91, ఐకే1ఏ గని 68 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసి2 63 శాతం, ఐకే ఓసిపి 25 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 61 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. అధిక వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలిపారు. ఆర్ & ఆర్ కాలనీల్లో రహదారులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటినట్లు తెలిపారు. రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ సిస్టం ద్వారా గోదావరి నుంచి ఉద్యోగుల క్వార్టర్లకు రక్షిత మంచి నీటిని అందిస్తామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3470 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ లో కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలు, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి విద్యా కోర్సుల శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు, ఉద్యోగులకు సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఇంచార్జి డీజీఎం (పర్సనల్) రాజేశ్వర్ రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్ శ్రీ నెక్స్ట్ జెన్ స్కూల్ లో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బండారి మమత బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.