ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సూరిమిల్ల వేణు, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ లు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతి, అహింసా మార్గంలో పోరాడారని అన్నారు. అనంతరం స్వచ్ఛత హీ సేవ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మునిసిపాలిటీలో పని చేస్తున్న 5 మంది శానిటేషన్ సిబ్బందిని శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
2 October 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 155 వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో టీబీజీకేఎస్ శ్రేణులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. గాంధీజీ చూపించిన శాంతి మార్గంలో ప్రజలందరూ ముందుకు వెళ్లాలని, భారత దేశ ప్రతిష్టను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బండి రమేష్, సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండి లాల, గోనె స్వామి, సీనియర్ నాయకులు సాదుల భాస్కర్, గొర్ల సంతోష్, మైపాల్ రెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటివరకు గెలిచిన అన్ని సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యాయని, మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలన్నారు. చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, నూతన భూగర్భ గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కార్మికుల శ్రమతో సింగరేణికి లాభాలు తెచ్చారని, లాభాల నుంచి సంస్థ విస్తరణ కోసం కోట్లాది రూపాయలు కేటాయించడం సరి కాదని అన్నారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంలో చేరిన సమ్ము రాజయ్య, పెరక రామస్వామి, దేవేందర్ లకు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్ము రాజయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.