- కోల్ ఇండియాతో పోటీ పడే స్థాయికి సింగరేణి
- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ మనుగడ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలో నిర్వహించిన సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జనక్ ప్రసాద్ తో కలిసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, తొలి సరిగా కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి లాభాల నుంచి 5 వేల రూపాయల చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ అండగా ఉంటాయని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని అంటున్నాయని, సింగరేణి అనేది ప్రభుత్వరంగ సంస్థ అని, సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్లు, తెల్ల రేషన్ కార్డులు వచ్చేలా చూస్తామన్నారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఒరిస్సాలోని నైనీ బ్లాక్ సమస్య పరిష్కారం అయ్యిందని అన్నారు. త్వరలో సింగరేణి సంస్థ కోల్ ఇండియాతో పోటీ పడే స్థాయికి చేరుతుందన్నారు. గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని, మాజీ సీఎం కేసీర్ శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 450 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారని, డిపెండెంట్ల వయోపరిమితి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడం వల్ల ఎన్నో కార్మిక కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. అనంతరం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్ కార్పొరేషన్ చైర్మన్ బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు గతం కంటే మెరుగైన లాభాల వాటా చెల్లించిందని, పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని పలువురు రిటైర్డ్ కార్మికులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు జెట్టి శంకర్ రావు, కాంపెల్లి సమ్మయ్య, నర్సింహా రెడ్డి, ధర్మపురి, భీం రావు, గరిగ స్వామి, కలవేన శ్యామ్, సురిమిళ్ళ వేణు, బండారి సుధాకర్, తూముల నరేష్, పూదరి తిరుపతి, కాంగ్రెస్ , ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.