- సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశంలో మతాల, కులాల మధ్య చిచ్చుపెట్టే మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదామని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని నర్సయ్య భవన్ లో జోగుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సిపిఐ మంచిర్యాల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో కాన్పూర్ లో ఆవిర్భవించిందని, సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందేళ్ల స్ఫూర్తితో కార్మిక రాజ్య స్థాపనకు పోరాడుదామని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రానికి స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ పని చేసిందని, దున్నేవాడికే భూమి ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికి అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టిందని, కార్మికవర్గ ఉద్యమాలకు సీపీఐ కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. కార్మిక వర్గం కోసం కామ్రేడ్ పి. నర్సయ్య ప్రాణాలు అర్పించారని అన్నారు. నిరంతరం ప్రజల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షపాతిగా సిపిఐ పని చేస్తుందని అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే పేద ప్రజల వికాసం కాకుండా కార్పొరేట్ కంపెనీల వికాసం మాత్రమే దేశంలో కొనసాగుతుందని విమర్శించారు. దేశంలో సమానత్వం ఉండకూడదని రాజ్యాంగ మౌలిక సూత్రాలు మార్చాలని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. సంపద సృష్టికర్తలు అయిన కార్మికులకు, రైతు చట్టాలు మార్చి రైతులకు హక్కులు లేకుండా బిజెపి ప్రభుత్వం చేసిందని, బడా వ్యాపార వర్గాల కోసం మాత్రమే బిజెపి పని చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎస్.సి.డబ్ల్యూ.యూ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకురి నగేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిర్యాల రాజేశ్వర్ రావు, ముస్కే సమ్మయ్య, బాజీ సైద, ఎన్.ఐ.ఎఫ్.డబ్ల్యు మహిళ సంఘం జిల్లా కార్యదర్శి రేగుంట చంద్ర కళ, నాయకులు కొట్టే కిషన్ రావు, మేదరి దేవవరం, కుంచాల శంకరయ్య, దొడ్డిపట్ల రవీందర్, దేవి పోచన్న, తోకల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.