- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యోగులు హాజరు శాతం మెరుగుపరుచుకుని, సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 111 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 86 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్.కె 5 గని 102 శాతం, ఆర్.కె 6 గని 104 శాతం, ఆర్.కె 7 గని 84 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 112 శాతం, ఎస్సార్పీ 1 గని 73 శాతం, ఎస్సార్పీ3,3ఏ గని 81 శాతం, ఐకె 1ఎ గని 78 శాతంతో భూగర్భ గనులు 90 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి2 146 శాతం, ఐకె ఓసీపీ 60 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 111 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాంకేతికతతో సింగరేణిలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాగితపు రహిత సేవలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పని స్థలాల్లో విధిగా రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణతో బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్ఓపి, ఎస్ఎంపి పాటించాలని అన్నారు. ఫిబ్రవరి నెలలో కౌన్సిలింగ్ ద్వారా 77 మంది ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించినట్లు, ఈ నెలలో 161 మంది ఉద్యోగులకు ఎస్.ఎల్.పి ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. యువ ఉద్యోగులు తమ నామినీ వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, ఏజీఎం (ఫైనాన్స్) మురళి తదితరులు పాల్గొన్నారు.