నస్పూర్, ఆర్.కె న్యూస్: వ్యాపారస్తులు తమ దుకాణాల్లో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్ తెలిపారు. బుధవారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిసి కెమెరాల ఆవశ్యకత, ట్రాఫిక్ నిబంధనలపై స్ట్రీట్ వెండర్స్ కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ సీఐ మాట్లాడుతూ, స్ట్రీట్ వెండర్స్ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు లో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
19 March 2025
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
- కారుణ్య నియామక పత్రాలు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరుతున్న యువ ఉద్యోగులు సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 52 మంది కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశానికే తలమానికం అయిన సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి యువతి, యువకులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. యువ ఉద్యోగులు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా, గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని, తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో రెండో తరానికి ఉద్యోగాలు రావడం తమ అదృష్టంగా భావించాలని, ఉద్యోగం కల్పించిన తమ తల్లిదండ్రులను, అత్తమామల బాగోగులు చూసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని చెప్పారు. ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని సాధించాలని, సీనియర్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో భయాందోళనలకు గురి కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సమకూర్చిన పరీక్ష సామాగ్రిని జీఎం పదో తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏ. రాజేశ్వర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆర్. విష్ణువర్ధన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సంతోష్, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.