నస్పూర్, ఆర్.కె న్యూస్: అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి శ్రీరాంపూర్ కటిక దుకాణాల దగ్గర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ, 1956 మే 3న భగత్ సింగ్ ఆశయ సాధన కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించిందని, ఎన్నికల హామీ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి మహేష్, మండల నాయకులు ఎస్.కె అక్బర్, తిరుపతి, శ్రీనివాస్, రాజేష్, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
3 May 2025
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆర్. కె న్యూస్: వేసవి సెలవులలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ పాఠ్య, పాఠ్యేతర అంశాలను అందిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, డాన్స్, మ్యూజిక్, యోగ, మెడిటేషన్, కంప్యూటర్ కోడింగ్, పెయింటింగ్ మొదలైన అంశాలలో శిక్షణ అందించేందుకు శిబిరం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని, ఈ నెల 17వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. క్రీడలు, ఇతర రంగాలలో జట్టులో ఉన్న సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకోవాలని, వేసవి శిక్షణ శిబిరాలలో విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మనం నేర్చుకునే అంశాలను నిశితంగా పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని, ప్రజా ప్రయోజనకరంగా వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఒక సమస్యను అనేక దారులలో పరిష్కరించవచ్చని, చివరగా పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలో ప్రయత్నించడమే తొలి విజయమని, ఏకాగ్రత, ఇష్టంతో నేర్చుకుంటే నైపుణ్యత సాధించవచ్చు అని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ప్రయత్నించాలని తెలిపారు. జిల్లాలోని 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నుండి దాదాపు 200 మంది విద్యార్థినులను తీసుకురావడానికి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ రావు, శిబిరం సమన్వయకర్త, నస్పూర్ ప్రత్యేక అధికారి మౌనిక సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.