13 May 2025
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పరిధిలోని అభినవ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల సీఐ అశోక్ సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 9న సాయంత్రం కూసి తిరుపతి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి సొంత గ్రామానికి వెళ్లి మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉందని, ఇంటి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూంలో ఉన్న టేబుల్ లాకర్ ఓపెన్ చేసి ఉందని అందులో ఉన్న పావు తులం బంగారం చెవి కమ్మలు, 2 వేల రూపాయలు నగదు, దేవుడి గదిలో ఉన్న 30 తులాల వెండి వస్తువులు, ఇంటి హాల్ లో ఉండే హోమ్ థియేటర్, సౌండ్ బార్ కనిపించడం లేదని, గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేయగా, సీసీసీ నస్పూర్ పోలీసులు సోమవారం మూడు బృందాలుగా ఏర్పడి కలెక్టరేట్ చౌరస్తా వద్ద నిర్బంధ వాహన తనిఖీలు చేస్తుండగా మంచిర్యాల నుండి గోదావరి ఖని వైపు వేగంగా వెళుతున్న అనుమానిత కారును ఆపి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా తాము నస్పూర్లో దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్న రానమల్లె గజనంద్, సయ్యద్ అమాన్ లను రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. దొంగతనం కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ లు అభినందించారు.
- సెక్యూరిటీ సిబ్బంది సేవలు అభినందనీయం
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర కీలకమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సెక్యూరిటీ విభాగంలో నూతనంగా నిర్మించిన వేదికను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రారంభించారు. ఇటీవల ఇందారం ఉపరితల గని చెక్ పోస్ట్ సమీపంలో కాపర్ కేబుల్ దొంగలను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది బి. వెంకటేష్, ఓ. తిరుపతి, శ్రీనివాస్, కొమ్మ బాపులను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, సుమారు 80 వేల రూపాయల విలువ గల సింగరేణి ఆస్తిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడడం అభినందనీయమని, సింగరేణి ఆస్తిని ఎల్లవేళలా కాపాడాలని, సెక్యూరిటీ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు బార్డర్ లో సైనికుల మాదిరి తమ విధులు నిర్వర్తించాలని, సింగరేణి ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్క సెక్యూరిటీ ఉద్యోగి పట్టుదలతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, ఎస్.ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ శంకరయ్య, ఇన్స్పెక్టర్లు రామి రెడ్డి, రాజన్న, ఇతర సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.