- సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలి
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య అన్నారు. శనివారం వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్ లో నిర్వహించిన మంచిర్యాల జిల్లా మూడో మహా సభలో పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు కావస్తున్నా అక్రిడిటేషన్ కార్డులకు ఇంకా స్టికర్లు వేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని, అవి పనిచేయడం లేదని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని, ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొన్నారు. సంఘ సభ్యులoదరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించ లేదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ, సమస్యల పై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మూడో మహాసభ వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్ లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింది మధుసూదన్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా చుంచు చందు (వార్త), అరికిల్ల జీవన్ బాబు (బీసీఎన్ న్యూస్ ఛానల్), గొర్రె లక్ష్మణ్ (ఎస్ఎల్ఎన్ న్యూస్ ఛానల్), సంయుక్త కార్యదర్శులుగా బుద్దె రవికుమార్ (వార్త), ఇప్ప రాజ్ కుమార్ (శెనార్తి మీడియా), కోశాధికారిగా క్యాతం రాజేష్ (నేటివార్త), జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ముత్యం వెంకటస్వామి (విజయ క్రాంతి), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గోపతి సత్తయ్య (వార్త), మేకల ప్రభాకర్ (మన తెలంగాణ), ఆవిడపు వెంకటేష్ (నవతెలంగాణ), సభ్యులుగా ఎం. శేఖర్ (శెనార్తి తెలంగాణ), జాడి వెంకటయ్య (నవతెలంగాణ), నేరెళ్ల సంతోష్ గౌడ్ (నేటి ధాత్రి), కే రామాచారి (నవభూమి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.