15 July 2025
- హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: వర్షాకాలంలో సంక్రమించే సీజనల్ వ్యాధుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గని పై వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షా కాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల బెడద తీవ్రంగా ఉంటుందని, నివాస ప్రాంతాల్లో మురికి నీరు నిలువకుండా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడిఎస్ ఈజీ దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే భయంకరమైన వ్యాధి డెంగ్యూ అని, ఈ దోమలు పగటి వేళ కుడతాయని, దోమ కుట్టిన ఐదు నుంచి ఎనిమిది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీకాలు లేవని, దోమ కాటుకు గురి కాకుండా దోమ తెరలు వాడాలని, నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి ట్యాంకులను మూసి ఉంచాలని, వర్షపు నీరు నిల్వ ఉండే కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 7 గని మేనేజర్ జె. తిరుపతి, గుర్తింపు సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, గని రక్షణ అధికారి సంతోష్ రావు, ఇంజనీర్లు ప్రవీణ్, సుధీర్, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్ రావు, అండర్ మేనేజర్లు రవీందర్, రాము, రాజు, పిట్ సెక్రటరీ మారెపల్లి సారయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.