- నూతన భూగర్భ గనులు ప్రారంభించాలి
- హెచ్ఎంఎస్ త్రై వార్షిక మహాసభలను విజయవంతం చేయాలి
- హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తామని జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, ఆగస్టు 23, 24 తేదీల్లో హెచ్ఎంఎస్ త్రై వార్షిక మహాసభలు శ్రీరాంపూర్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా నూతన భూగర్భ గనులు ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గోలేటి నుండి సత్తుపల్లి వరకు కార్మిక భరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సింగరేణి మెడికల్ బోర్డు అవినీతి మయంగా మారిందని, మెడికల్ బోర్డు రద్దుచేసి గతంలో మాదిరిగా రెండు సంవత్సరాల సర్వీసు ఉన్న కార్మికులను అన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఎస్.టి.పి.పిలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విభాగం పట్టించుకోవడంలేదని, షిఫ్ట్ మార్పు, చార్జిషీట్ పెండింగ్ లో ఉంచడానికి, ప్రమోషన్ యాక్టింగ్ ల కొరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో గెలిచిన కార్మిక సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కొన్ని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్న కార్మికులను బదిలీలు, సెక్షన్లు మారుస్తారని, చార్జిషీట్లు ఇస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19న గోదావరిఖని జరిగిన హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ సమావేశంలో తిప్పారపు సారయ్యను సింగరేణి మైనర్స్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం తిప్పారపు సారయ్య మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, నాయకులు గోల్ల సత్యనారాయణ, దుర్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.