- విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఆర్.కె స్: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల ద్వారా జ్ఞానం, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం నూతన భవనాన్ని షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, 13వ పటాలము కమాండెంట్, సమన్వయకర్త శ్రీధర్, తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఏ పాఠశాలలో అయినా ఒక ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులు మాత్రమే చదువుకుంటారని, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలలో వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ సంస్కృతుల నుండి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికగా విద్య అభ్యసించడం జరుగుతుందని తెలిపారు. మాతృభాషతో పాటు ఆంగ్లం, హిందీ భాషలు విద్యార్థులకు అందించబడతాయని, కేంద్రీయ విద్యాలయాలలో విద్య అభ్యసించిన వారు ఉన్నత విద్య అనంతరం జాబ్ మార్కెట్ లో రాణించేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తాము నేర్చుకున్న క్రమశిక్షణతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారని తెలిపారు. ఏకాగ్రతతో కష్టపడే వారు విజయం సాధిస్తారని, తమ జీవితంలో ఎదుర్కొనే హెచ్చుతగ్గులను అధిగమించి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, కళలు ఇతర ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని, సమాజాన్ని తెలుసుకోవాలని తెలిపారు. సోషల్ స్కిల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, పిల్లలతో ప్రవర్తించే విధానంలో తమ సంస్కారం కనిపిస్తుందని తెలిపారు. సత్ప్రవర్తన, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, పోటీతత్వానికి పాఠశాల పునాది వంటిదని తెలిపారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో విద్య అభ్యసించి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని వాటిని సాధించే దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. అనంతరం విద్యాలయం ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.