- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: గైర్హాజరు ఉద్యోగులు తమ హాజరు శాతాన్ని మెరుగుపరుచుకుని, సింగరేణి పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఏరియాలోని ఆర్.కె 7 గనిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 150 మస్టర్లు చేయని ఉద్యోగులకు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అదృష్టమని, గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని, హాజరు శాతాన్ని పెంచుకోవాలని గైర్హాజరు ఉద్యోగులు సూచించారు. సింగరేణి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు ఇతర ఏ సంస్థలలో లేవని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగులు ప్రతి నెల 20 పైన మస్టర్లు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని, విధులకు హాజరు కాకపోతే సమస్యలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని, ఉద్యోగం పోతే మళ్ళీ రావడానికి కష్టమవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విధులకు తప్పనిసరిగా హాజరవుతూ వారికి కేటాయించిన ఎనిమిది గంటల పనిని రక్షణతో చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ జె. తిరుపతి, గని సంక్షేమాధికారి శంతన్, పిట్ కార్యదర్శి మారెపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు.



