- సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- మహిళల భద్రత కోసం టీ – సేఫ్ యాప్
- మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్
నస్పూర్, ఆర్.కె న్యూస్: షీ టీమ్, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆక్స్ ఫోర్డ్ హైస్కూల్ లో విద్యార్థులకు షీ టీమ్, మహిళా చట్టాల పై పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, టీ – సేఫ్ యాప్, షీ టీమ్ లపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ పోక్సో చట్టం లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టమని, 2012లో వచ్చిన ఈ ఫోక్సో చట్టం 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది అని వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణ శిక్ష కూడా విధిస్తారని అన్నారు. విద్యార్థినులు ఆకతాయిల వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100కు లేదా షీ టీమ్ నంబర్‌కు ఫోన్ చేయాలని, వేధింపులను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయడం, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ వేధింపులకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇంచార్జి ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ చిన్న పిల్లల శరీర భాగాలపై ఎవరైనా అపరిచితులు అనుచితంగా తాకినప్పుడు లేదా ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు అది బ్యాడ్ టచ్ అని గ్రహించి, వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని వివరించారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం టీ – సేఫ్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, అత్యవసర పరిస్థితుల్లో దానిని ఉపయోగించే విధానం గురించి వివరించారు. షీ టీమ్ సేవలు, వాటి ఉద్దేశాన్ని గురించి వివరిస్తూ,ఎప్పుడూ అందుబాటులో ఉండే డయల్ 100 లేదా రామగుండం షి టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షి టీమ్ నంబర్ 8712659385 అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ ఫోర్డ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ జస్టిన్, వైస్ ప్రిన్సిపాల్ సోనూ, ఉపాధ్యాయులు , షి టీమ్ సిబ్బంది మహిళా కానిస్టేబుల్ శ్రీలత, కానిస్టేబుల్ సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



