శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
ఆర్.కె. న్యూ టెక్ గనిలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు
శ్రీరాంపూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పని చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గనిలో రక్షణ వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ వి. శ్రీనాథ్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘుకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఆర్.కె. న్యూ టెక్ గనికి ప్రత్యేక గుర్తింపు ఉందని, రక్షణ విషయంలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించే 5 స్టార్ రేటింగ్ అవార్డులలో గని ఎంపిక కావడం, రక్షణ పరంగా ఎన్నో అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు. కార్పొరేట్ ఏ.జి.ఎం (సిఎంసి) వి. శ్రీనాథ్ మాట్లాడుతూ, ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్ణీత సమయాని కంటే 10 నిమిషాలు ముందుగానే ఇంటి నుండి బయలుదేరాలని సూచించారు. ప్రమాద రహిత పని ప్రదేశం కోసం ప్రతి ఒక్కరూ ఏ.బి.సి.డి నియమాన్ని పాటించాలన్నారు. ఇందులో ‘ఏ’ అంటే ఆటిట్యూడ్ (వైఖరి), బి అంటే బిహేవియర్ (ప్రవర్తన), సి అంటే కల్చర్ (సంస్కృతి), డి అంటే డిసిప్లీన్ (క్రమశిక్షణ) అని వివరించారు. ఈ నాలుగు అంశాలను పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి సెక్రటరీ ఎం. కొమురయ్య, గని ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ కె. శ్రీనివాస్, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, గ్రూప్ ఇంజనీర్ ఏ. మోహన్, గని రక్షణాధికారి కొట్టే రమేష్, గని సంక్షేమాధికారి, పాల్ సృజన్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు, రక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



