నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా ముగించినందుకు గాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సారధ్యంలో ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగిందని, ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) డి. వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి కొమ్మెర సతీష్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు ఎం. మోహన్, ఆర్. మహేందర్, పి. శ్రీనివాస్, ఎన్. రాజేశ్వర్, బి. గంగ మోహన్, ఎంపీఓలు శ్రీపతి బాపన్న, అజ్మత్, బి. శ్రీనివాస్, వి. శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ, అనిల్ కుమార్, సతీష్ కుమార్, అక్తర్, ప్రసాద్, జలంధర్ తదితరులు పాల్గొని కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
18 December 2025
శోభాయాత్రగా చిత్రపటాల ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో ఏఎస్ఆర్ఆర్ నగర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గల అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి వరకు అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏఎస్ఆర్ఆర్ నగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బోయిని కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సంగనబట్ల నరహరిశర్మ గురుస్వామి పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అయ్యప్ప, గణపతి, కుమారస్వామి చిత్రపటాలను కాలనీలో భక్తులు, స్వాములు శోభాయాత్రగా పూజా మందిరం వరకు తీసుకువచ్చారు. పడిపూజలో భాగంగా 18 కలశాలతో, 18 రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల కాలు భజన, అఖండ భజనలతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సమితి శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లచ్చన్న, రాష్ట్ర మీడియా ఇంచార్జి భాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు రఘుపతిరావు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు కొత్తగట్టు శ్రీనివాసచారి, ముల్కల రవికృష్ణ, అప్పయ్య, నగేష్, అరుణ్ కుమార్, సంపత్, ప్రసాదాచారి, ఆలయ కార్యదర్శి ముత్తె రాజయ్య, లక్ష్మణరావు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐతో ఫోటో సృష్టించిన నిందితుడిపై కేసు నమోదు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసిసి టౌన్ షిప్ పరిధిలో బుధవారం రాత్రి పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) శివ్ ఆశిష్ సింగ్ స్పష్టం చేశారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో ఒక వ్యక్తి పులి ఫోటోను సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. పులి వార్తలతో ప్రజలు ఆందోళన చెందడంతో డిఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్, రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, ఎక్కడా పులి జాడ గానీ, పాదముద్రలు గానీ లభించలేదు. దీంతో అది తప్పుడు ఫోటో అని అధికారులు ధ్రువీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడు ఫోటో సృష్టించిన వ్యక్తిని గుర్తించిన అధికారులు, అతడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి అది ఫేక్ అని ఒప్పించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే 9440313191, 9441533220 నెంబర్లకు తెలపాలని అధికారులు కోరారు.
గతంలో రూ. 3.30 లక్షలు.. ఇప్పుడు కేవలం రూ. 60 వేలేనా?
యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా జరుపుకునే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిధులను యాజమాన్యం భారీగా తగ్గించడాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరు కొమురయ్య గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రకృతితో పోరాడి బొగ్గు ఉత్పత్తి చేస్తూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏటా సింగరేణి దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్‌కు గతంలో రూ. 3,30,000 నిధులు కేటాయించేవారని, ఆ నిధులతో ముగ్గుల పోటీలు, క్రీడలు, వెల్ బేబీ షో వంటి కార్యక్రమాలు నిర్వహించి కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నింపేవారని గుర్తు చేశారు. కానీ, ఈ ఏడాది ఆ నిధులను ఏకంగా 25 శాతానికి తగ్గించి, కేవలం రూ. 60,000 మాత్రమే మంజూరు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. సంస్థకు సంబంధం లేని ఇతర జిల్లాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న యాజమాన్యం, కార్మికుల ఆనందం కోసం నిర్వహించే వేడుకల నిధుల్లో కోత విధించడం సరికాదని వారు ధ్వజమెత్తారు. యాజమాన్యం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలు ఉత్సవాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం స్పందించి, గతంలో ఇచ్చిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల మధ్య సింగరేణి దినోత్సవాన్ని జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే మెరుగైన భవిష్యత్తు
చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: చిన్నారులు చిన్నప్పటి నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆటలు, వ్యాయామం మరియు చదువుపై దృష్టి సారిస్తేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు ఆధ్వర్యంలో నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి, వారికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్నారుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, శిశు సంరక్షణ పద్ధతులపై తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి భవిష్యత్తు ఎంతో విలువైనదని, చిన్నప్పటి నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నేటి కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, ఆటపాటలు, వ్యాయామం మరియు చదువుపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలకు వేయించాల్సిన టీకాలు, పౌష్టికాహారం మరియు క్రమబద్ధమైన వైద్య పరీక్షల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు అందజేస్తామని ఆయన ప్రకటించారు.
పౌష్టికాహారం, పరిశుభ్రతతోనే దృఢమైన ఎదుగుదల
సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి మాట్లాడుతూ, చిన్ననాటి ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తులో పిల్లలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతారని వివరించారు. తల్లులు పిల్లల పోషణ మరియు పరిశుభ్రత విషయంలో కనీస అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, సీనియర్ పీవో ఎస్. సురేందర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. మురళీధర్ రావు, డాక్టర్ మనీషా, పిట్ కార్యదర్శి విజయలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.



