శ్రీరాంపూర్ లో ముగిసిన కంపెనీ స్థాయి క్రీడా పోటీలు
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: క్రీడలు ఉద్యోగులలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక స్థైర్యాన్ని, జట్టు భావనను పెంపొందిస్తాయని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా శాంతి మైదానంలో వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్ క్రీడా పోటీల ముగింపు వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ఏరియాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అయితే క్రీడాకారులు ప్రదర్శించే క్రమశిక్షణ, పట్టుదల, క్రీడా స్ఫూర్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇక్కడ ప్రదర్శించిన ప్రతిభను రాబోయే కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ ప్రదర్శించి సంస్థకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. పోటీల్లో ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా, నిరంతర సాధనతో భవిష్యత్తులో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. క్రీడలు ఉద్యోగులలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక స్థైర్యాన్ని, జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఇటువంటి పోటీల వల్ల సంస్థలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, క్రీడల అభివృద్ధికి యాజమాన్యం ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఉద్యోగులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే ఏడాది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం, స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం (పర్సనల్), చీఫ్ కోఆర్డినేటర్ ఎస్. అనిల్ కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్ పాల్ స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, జాన్ వెస్లీ, పర్సా శ్రీనివాస్, ఎం. నరేందర్ రెడ్డి, సిహెచ్. రమేష్, కోఆర్డినేటర్ ఎస్. నరసయ్య, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్, వివిధ ఏరియాల కోఆర్డినేటర్లు, క్రీడాకారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



