ముల్కలపేట యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేసిన నీల్వాయి ఎస్సై
కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
వేమనపల్లి, ఆర్.కె న్యూస్: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. చెన్నూరు గ్రామీణ సీఐ బన్సిలాల్ ఆదేశాల మేరకు సోమవారం ముల్కలపేట గ్రామ యువకులకు ఆయన వాలీబాల్ క్రీడా సామాగ్రిని (కిట్) అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, వివిధ సామాజికాంశాలపై యువతకు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. భారతీయ నూతన న్యాయ చట్టాలు, రవాణా నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో యువత మొబైల్ ఫోన్లలో జూదం వంటి గేమింగ్ యాప్‌లకు ఆకర్షితులవుతున్నారని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని కోరారు.



