వేమనపల్లి, ఆర్.కె న్యూస్: నీల్వాయి గ్రామపంచాయతీలో మంగళవారం గ్రామ సర్పంచ్ చెన్నూరు సమ్మయ్య పారిశుధ్య పనులు చేయించారు. గత కొంతకాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ క్లీనింగ్, కాలువ పూడికలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీల్వాయి గ్రామ ప్రజలు తమ పరిధిలో ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని తీసుకువచ్చిన వెంటనే తన వంతు కృషిచేసి సమస్య పరిష్కరిస్తానని సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
6 January 2026
నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల ఇన్చార్జిగా నస్పూర్ పట్టణానికి చెందిన వేముల కిరణ్ నియమితులయ్యారు. మంగళవారం నస్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. నస్పూర్ ఏరియాలో పార్టీ గెలుపునకు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వేముల కిరణ్ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల-జగిత్యాల జోన్ ఇన్చార్జి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి దాగం శ్రీనివాస్, నాగుల కిరణ్ బాబు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలంలో గల టోల్ ప్లాజా వద్ద 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎ.సి.పి. రవికుమార్, జాతీయ రహదారుల సంస్థ జి.ఎం.(టి) & పి.డి. కె.ఎన్. అజయ్ మణికుమార్ లతో కలిసి వాహనదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత మరణానికి గురవుతున్నారని, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుందని తెలిపారు. వాహనాన్ని వేగంగా నడపడం, పరిమితికి మించి లోడ్ తో ప్రయాణించడం కారణంగా వాహనాలు అదుపు తప్పుతాయని, అందువలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం, జాతీయ రహదారిపై వాహనాలను నిలుపుదల చేయడం, పశువులను రహదారిపైకి వదలడం చేయవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు. జాతీయ రహదారుల సిబ్బంది రహదారి నియమ, నిబంధనలను పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని, రహదారులపై పని చేసే సిబ్బంది సైతం పని చేసే సమయంలో సేఫ్టీ కిట్స్ ధరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సరైన కండిషన్ లో ఉన్న వాహనాన్ని మాత్రమే ఉపయోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ లో మాట్లాడవద్దని, ట్రాఫిక్ భద్రత నియమాలను పాటించాలని తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నామని, రహదారులపై వేగ నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచికలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జ్యోతిబాపూలే గురుకుల కళాశాలను సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని, విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, వసతి సౌకర్యాలు, విద్యాబోధన తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కళాశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, చదువులో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. “విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా నేను మీ వెంట ఉంటా” అని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కళాశాలకు అవసరమైన అదనపు మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కళాశాల సందర్శనకు విచ్చేసిన ఎంపీకి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పురుషోత్తం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. కళాశాల అభివృద్ధిపై ఎంపీ చూపుతున్న చొరవకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

‘యువత జర భద్రం’ లఘు చిత్రాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నేటి సమాజంలో యువత పెడదోవ పట్టి, చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపే ‘యువత జర భద్రం’ అనే లఘు చిత్రాన్ని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఎ. భాస్కర్ ఆవిష్కరించారు. మంగళవారం తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మార్గదర్శకత్వంలో, ఉత్తమ ఎన్.సి.సి. క్యాడెట్ నార్ల మహేందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
- తప్పుడు స్నేహాలతో భవిష్యత్తు అంధకారం
ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, యువత చదువును నిర్లక్ష్యం చేస్తూ, తప్పుడు స్నేహాల ప్రభావంతో గంజాయి, మద్యం, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి భవిష్యత్తు ఏ విధంగా అంధకారమవుతుందో ఈ చిత్రంలో చక్కగా వివరించారని కొనియాడారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నార్ల మహేందర్, ప్రోత్సహించిన యోగేశ్వర్, నటులు ఆకాష్, అనిల్, సాగర్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
యువతను మేల్కొలిపే సందేశంతో కూడిన ఈ లఘు చిత్రాన్ని ‘టీ బ్రేక్’ (Tea Break) యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. సామాజిక స్పృహ కలిగించే ఇటువంటి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
- జిల్లాలోని అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తాం
- ఏఏపీ జిల్లా అధ్యక్షులు నయీం పాషా
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కార్యక్షేత్రంలోకి దిగుతోందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నయీం పాషా ప్రకటించారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి నిర్మూలన ధ్యేయంగా పుట్టిన తమ పార్టీ, రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపల్ డివిజన్లు, వార్డులలో అభ్యర్థులను బరిలోకి దించుతుందని స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న అభ్యర్థులు పార్టీ తరపున పోటీ చేసేందుకు జిల్లా నాయకత్వాన్ని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గడిచిన కాలంలో జిల్లాలో ప్రజల పక్షాన నిలబడి తాము చేసిన అనేక పోరాటాలను నయీమ్ పాషా గుర్తు చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ఎస్సీ బాలికల హాస్టల్కు కేటాయించేలా చేయడంలో ఏఏపీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడామని వివరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును అక్కడి నుండి తరలించేందుకు తాము ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కాంత్, ఉపాధ్యక్షులు రాజేందర్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



