సింగరేణి రిటైర్డ్ అసోసియేషన్ కృషి ఫలితం
ఏ స్టేట్ బ్యాంక్ శాఖలోనైనా దరఖాస్తు చేసుకునే సదుపాయం.. దేశవ్యాప్త కోల్ ఇండియా ఉద్యోగులకు వర్తింపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరంతర పోరాటంతో కుటుంబ పెన్షన్ పొందే విధానంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. పెన్షనర్లు మరణించిన సందర్భంలో వారి వారసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధన్బాద్లోని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ అధ్యక్షులు దండంరాజు రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు పెన్షన్ ప్రాసెసింగ్ కేంద్రమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధన్బాద్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
- మారిన నిబంధనలు.. బాధితులకు ఊరట
గతంలో పెన్షనర్ మరణిస్తే కుటుంబ సభ్యులు పెన్షన్ ఖాతా ఉన్న నిర్దిష్ట బ్యాంకు శాఖకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం వారసులు తమకు సమీపంలోని ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలోనైనా సంబంధిత పత్రాలను సమర్పించవచ్చు. స్థానిక బ్యాంకు అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, మరణించిన వ్యక్తి పెన్షన్ను నిలిపివేయడంతో పాటు వారసులకు కుటుంబ పెన్షన్ త్వరితగతిన అందేలా ధన్బాద్ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలి.
- దేశవ్యాప్తంగా వర్తింపు
ఈ నూతన సదుపాయం కేవలం మన ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులందరికీ వర్తిస్తుందని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. పెన్షనర్లు స్టేట్ బ్యాంక్ శాఖలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం వల్లే ఈ కీలక మార్పు సాధ్యమైందని వారు పేర్కొన్నారు. దీనివల్ల వందలాది కుటుంబాలకు వ్యయ ప్రయాసలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేశారు.



