యువతకు ఐటీ నైపుణ్యాలు మెండుగా ఉండాలి: ఆర్డీవో జి. శ్రీనివాస్ రావు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: స్థానిక యువతకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో నూతనంగా నెలకొల్పిన ‘నెక్స్ ఐరా’ ఐటీ కంపెనీ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మంచిర్యాల ఆర్డీవో జి. శ్రీనివాస్ రావు, రాష్ట్ర పర్యావరణ వాల్టా చట్టం సభ్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్, ఐజా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. తిరుపతిరెడ్డి, టీఎన్జీవోస్ అధ్యక్షులు గడియారం శ్రీహరిలతో కలిసి ఈ కంపెనీని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఇలాంటి ఐటీ సంస్థ ఏర్పాటు కావడం యువత ఉపాధి అవకాశాలకు, నైపుణ్యాల అభివృద్ధికి ఒక మంచి పరిణామమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల వంటి ప్రాంతంలో ఐటీ కంపెనీ సేవలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. సమకాలీన యువత సాఫ్ట్వేర్ నైపుణ్యాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సంస్థను స్థాపించిన మేనేజింగ్ డైరెక్టర్లు ఎం. శరత్ చంద్ర, సిహెచ్. రఘువరన్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. జీవితంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం తోడవ్వాలని సూచించారు. ఏఐ టెక్నాలజీని యువత సానుకూల మార్గంలో ఉపయోగించుకోవాలని, ‘నెక్స్ ఐరా’ యువతకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు. తన విద్యార్థి శరత్ చంద్ర స్వయంగా ఒక సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించడం గర్వకారణమని ఐజా కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
కంపెనీ లక్ష్యాలను మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర వివరిస్తూ.. మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఐటీ శిక్షణ, సేవలను అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రోఫెసర్ డా. రాజేష్, సి.వి. రామన్ కాలేజీ ప్రిన్సిపల్ నరసయ్య, ఎల్ఐసీ అధికారులు ఎం. రాందాస్, రాజేశం, సంస్థ ప్రతినిధులు సదన్, పూర్ణిమ, మనీషా, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.








