- ఆర్.కె-7 గ్రూపు గనుల అధికారులతో క్వాలిటీపై సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: గనుల నుంచి వెలికితీసే బొగ్గులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే సింగరేణి సంస్థ మనుగడ సాధ్యమవుతుందని బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రరావు స్పష్టం చేశారు. సోమవారం ఆర్.కె-7 గ్రూపు ఏజెంట్ కార్యాలయంలో ఆర్.కె-7, ఆర్.కె-న్యూటెక్ గనుల అధికారులతో బొగ్గు నాణ్యతపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గనులకు సంబంధించిన ఉత్పత్తి వివరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నేటి పోటీ ప్రపంచంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని పేర్కొన్నారు. బొగ్గు వెలికితీత సమయంలోనే నాణ్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడితే సంస్థ భవిష్యత్తుకే ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూపు ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్లు జె. తిరుపతి, కె. శ్రీనివాసు, రక్షణాధికారులు ఇ. సంతోషరావు, కె. రమేష్, క్వాలిటీ అధికారులు జగదీశ్వర్ రావు, పరమేశ్వర్ రావు పాల్గొన్నారు.



