సిసిసి కార్నర్లో బస్సు షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ కోసం నిరసన
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల కేంద్రంలోని సిసిసి కార్నర్ వద్ద బస్సు షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మంగళవారం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మిడివెల్లి రాజ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పనుల వల్ల తొలగించిన బస్సు షెల్టర్‌ను పునరుద్ధరించకపోవడంపై మండిపడ్డారు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసనలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమన్నారు. కనీస అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ లేక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, సంజీవ్, గంగాధర చారి, నరసయ్య పాల్గొన్నారు.




