మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ తాళ్లపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ వార్డు సభ్యుడు బొడ్డు తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ పురోగతి కోసం శ్రమిస్తున్న నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులను చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా సురేఖ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల రమేష్ పాల్గొన్నారు.
24 January 2026
భక్తుల సౌకర్యార్థం వెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానుల ఉదారత
మల్యాల, ఆర్.కె న్యూస్: కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం వెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానులు పి. రాందేవ్ రావు, లక్ష్మణ్ రావు ఎలక్ట్రిక్ ఆటోను విరాళంగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని చెక్ పోస్ట్ నుండి ప్రధాన దేవాలయం వరకు భక్తులను చేరవేసేందుకు ఈ వాహనాన్ని వినియోగించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీకాంత్ రావు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన దాతలు శనివారం ఆలయాన్ని సందర్శించి వాహన తాళాలను అధికారులకు అందజేశారు. కొండపైకి నడవలేని వృద్ధులు, వికలాంగులు, ఇతర భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని సమర్పించడం పట్ల ఆలయ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. భక్తుల సౌకర్యాల కల్పనలో దాతలు ముందుకు రావడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో భక్తులకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి.
- రోడ్ల విస్తరణ, అండర్ డ్రైన్ పనులకు సహకరించాలని విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మార్కెట్ ఏరియాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. శనివారం మార్కెట్ పరిసరాల్లో పర్యటించిన ఆయన, వ్యాపారస్తులతో ముఖాముఖి చర్చించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పురోగతి కోసం చేపట్టబోయే భూగర్భ మురికి కాలువ (అండర్ డ్రైన్), రహదారుల విస్తరణ పనులకు వ్యాపారస్తులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద పర్యటించిన ఎమ్మెల్యే, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. మార్కెట్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పనుల వల్ల మార్కెట్ ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకుంటుందని, ట్రాఫిక్ సమస్యలు తొలగి వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
అనంతరం అభివృద్ధి పనుల రూపకల్పన, అమలుపై సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. సింగరేణి వాసులకు పట్టాల పంపిణీకి హామీ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గంలో గత ఏడు దశాబ్దాలుగా పాలించిన వారు చేయని అభివృద్ధిని తన హయాంలో చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో త్వరలోనే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల కాలంలో శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 282 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు సాగు, తాగునీరు, మౌలిక సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
ఐబీ చౌరస్తా వద్ద 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని మోదెల, ద్వారక, గుడిరేవు, గూడెం గ్రామాల్లో 74.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

- మంచిర్యాలలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
- ‘వనిత వాక్కు’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, ఆరోగ్యం, చదువు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఫౌండేషన్ కో-ఫౌండర్లు తాళ్లపల్లి కవిత, సునీత కుర్మ ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత లక్ష్యాల దిశగా సాగాలని సూచించారు. అనంతరం గౌరవ అధ్యక్షురాలు జ్యోత్స్న చంద్రధత్, అడ్వైజరీ కమిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అన్నపూర్ణ యోగా, ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. శారీరక, మానసిక దృఢత్వం కలిగినప్పుడే చదువులో రాణించగలరని, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బహుమతులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎంలు బండి రమేష్, కుమార్, ఉపాధ్యాయురాలు రమాదేవిని ఫౌండేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.

- జాయింట్ కలెక్టర్‌కు అసోసియేషన్ డైరీల అందజేత
మేడ్చల్, ఆర్.కె న్యూస్: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డిని కలిశారు. వయోవృద్ధుల సంక్షేమం, వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన సౌకర్యాల కల్పనలో సంఘాలకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ అసోసియేషన్ డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి కరుణాకర్ రెడ్డి, స్త్రీ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు కూడా డైరీలను పంపిణీ చేశారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్ల హక్కుల పరిరక్షణకు తమ సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వి. ఇన్నా రెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి. నర్సయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు యాది రెడ్డి, ఉపాధ్యక్షుడు కె. వెంకయ్య, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
యాజమాన్యం తీరుపై అనిల్ రెడ్డి ధ్వజం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న అహేతుక బదిలీల వల్ల శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఈపీ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడు వంటకాల అనిల్ రెడ్డి విమర్శించారు. శనివారం శ్రీరాంపూర్‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన డిప్యూటేషన్ల ప్రక్రియను తప్పుబట్టారు. శ్రీరాంపూర్ ఓసీపీ నుండి ఈపీ ఆపరేటర్లను ఇందారం ఓసీపీకి పంపిస్తూనే, ఆర్జీ-2 ఏరియా ఈపీ ఆపరేటర్లను శ్రీరాంపూర్ రావాలని కోరుతూ సర్క్యులర్ జారీ చేయడం యాజమాన్యం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఆర్జీ-2 ఏరియా వారిని నేరుగా ఇందారం ఓసీపీకి పంపే అవకాశం ఉన్నా, శ్రీరాంపూర్ కార్మికులను కావాలనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ శ్రీరాంపూర్, ఇందారం నుండి 18 మందిని మణుగూరుకు పంపించి కార్మికుల కుటుంబాల్లో గందరగోళం సృష్టించారని గుర్తుచేశారు. సంస్థలో పైరవీకారుల జోక్యం పెరిగిందని, రికమండేషన్లు ఉన్న వారిని శ్రీరాంపూర్‌లోనే ఉంచుతూ సామాన్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా చేపడుతున్న ఈ బదిలీల వల్ల కార్మికులు మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం తన మొండి వైఖరిని వీడి కార్మికుల సమస్యలపై తక్షణమే స్పందించాలని అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు.




