- బి.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్ సంస్థల నుండి ప్రశంసా పత్రాలు
- సిబ్బందిని అభినందించిన జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలో గ్యాస్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సింగరేణి సూపర్ బజార్ సిబ్బందిని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అభినందించారు. వినియోగదారులకు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ సంస్థకు మంచి గుర్తింపు తెచ్చిన సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజుతో పాటు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎల్.పి.జి పంపిణీలో పారదర్శకత, అంకితభావం ప్రదర్శించినందుకు గాను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఓ.సి.ఎల్ – ఇండేన్) సంస్థల నుండి ప్రశంసా పత్రాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. సూపర్ బజార్ సిబ్బంది ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా వినియోగదారులకు సేవలందించాలని సూచించారు. జాతీయ స్థాయి చమురు సంస్థల నుండి గుర్తింపు పొందడం ద్వారా శ్రీరాంపూర్ ఏరియా ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఈ బృందాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, పర్సనల్ డిజిఎం అనిల్ కుమార్, ఏఐటీయూసీ నాయకుడు ముష్కె సమ్మయ్య, సూపర్ బజార్ సిబ్బంది పాల్గొన్నారు.




