🔴 34వ డివిజన్ ఎన్నికల ప్రచారం, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ (నస్పూర్) కాంగ్రెస్ అభ్యర్థి అగల్ డ్యూటీ రాజుకు మద్దతుగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే కాలనీల్లో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్ దీపాలు, విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని జనక్ ప్రసాద్ తెలిపారు. ఆసియాలోనే అత్యుత్తమ స్మశాన వాటిక ఏర్పాటుతో పాటు ఐటీ పార్క్, ఆటో నగర్, ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్, విద్యా సంస్థల నిర్మాణం వంటి పనులు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్ల వెడల్పు చేపట్టి హైవేలతో అనుసంధానం చేస్తున్నారని వివరించారు. ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే కార్పొరేషన్ లోని 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. మెడికల్ బోర్డు ద్వారా 95 శాతం ఇన్ వాలిడేషన్ చేయడం, పెర్క్స్ పై ఆదాయపు పన్ను మినహాయింపు, కోర్టు కేసుల పరిష్కారం, సొంతింటి పథకం అమలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇతర పార్టీల మాయ మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు జెట్టి శంకర్రావు, సిహెచ్ భీమ రావు, గరిగే స్వామి, కలవేన శ్యామ్, తిరుపతి రాజు, ఏను రవీందర్ రెడ్డి, పేరం రమేష్, జీవన్ జోయెల్, లేగల శ్రీనివాస్, చల్ల జయభరత్ రెడ్డి, మనోజ్, రావుల అనిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



