చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు
చెన్నూరు, ఆర్.కె న్యూస్: బలమైన లక్ష సాధన, కృషి, పట్టుదలతో జీవితంలో అనుకున్న విజయాలు సులభంగా సాధించవచ్చని పిఎం శ్రీ స్కూల్స్ మోటివేషన్ స్పీకర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు. శనివారం చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన “వ్యక్తిత్వ వికాసం – ఉత్తమ ఫలితాల సాధన” ప్రేరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపారు.
పేద కుటుంబాల నుండి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన మహానుభావులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని యోగేశ్వర్ సూచించారు. ఆశయం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివి రాణించాలని పిలుపునిచ్చారు. చెన్నూరు పట్టణం నుండి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారే స్థానిక విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలని గుర్తు చేశారు.
విద్యార్థి జీవితం చాలా విలువైనదని ఆయన వివరించారు. మనలో ఉన్న బలహీనతలను వదిలి, బలాలను మెరుగుపరుచుకుంటే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపే అవకాశం ఉంటుందని తెలిపారు. మన జీవితాలను మనమే అద్భుతమైన శిల్పాలుగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. సదస్సులో విద్యార్థులతో ‘విజేతలుగా నిలుస్తాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. మెడిటేషన్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే మార్గాలను నేర్పించారు.

సదస్సులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు, బట్ట సంచులను బహుమతులుగా పంపిణీ చేశారు. 1979 బ్యాచ్ పూర్వ విద్యార్థి అయిన గుండేటి యోగేశ్వర్ సేవలను గుర్తించి పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అర్షనపల్లి సతయ్య యోగేశ్వర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫణి రాజ, స్వర్ణప్రియ, పద్మప్రియ, వాణి శ్రీ, నిర్మల, ఆంజనేయులు, భరత్ కుమార్, ప్రశాంత్, శృతి, రజిత, సాయి కృష్ణ, రాజమొగిలి, హమ్నవాజ్, సమ్మగౌడ్, ప్రీతీ, వంశీ, సాయి కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.






