32వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్ని మధుకర్ గెలుపునకు పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగరంతో సమానంగా నస్పూర్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధర్ని మధుకర్ చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో వేసవి కాలం వస్తే నస్పూర్ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. అప్పట్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసేవారమని వివరించారు. ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం లేకుండా మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. నస్పూర్ మండల విద్యార్థుల కోసం త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్ అందుబాటులోకి రాబోతుందని వెల్లడించారు. అభివృద్ధి పథంలో నస్పూర్ దూసుకుపోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



