మంచిర్యాల 34వ వార్డులో అగ్గు సాగర్ ఘన విజయం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఖాతా తెరిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు నుంచి పోటీ చేసిన అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు జయభేరీ మోగిస్తున్న తరుణంలో ఈ గెలుపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను కాదని ఓటర్లు జనసేనకు పట్టం కట్టారు. హోరాహోరీ సాగిన ఎన్నికల పోరులో అగ్గు సాగర్ విజేతగా నిలవడం సంచలనంగా మారింది. ఓటర్ల మద్దతుతోనే ఈ ఫలితం సాధ్యమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విజయం మంచిర్యాల జిల్లాలో జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అగ్గు సాగర్ వెల్లడించారు.




