రూ. రెండు కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఉద్యమి, సాధక్, ప్రదాత పేర్లతో కొత్త వర్గీకరణ.. మంగళగిరిలో ఘనంగా ప్రారంభం
మంగళగిరి, ఆర్.కె న్యూస్: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూ. రెండు కోట్ల భారీ విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల నిబద్ధతతో పనిచేసే వారిని సమన్వయం చేస్తూ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ డ్రైవ్ చేపట్టారు. రాజకీయ పోరాటానికి బలాన్నిచ్చే కార్యకర్తలను, మద్దతుదారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
సభ్యత్వం తీసుకునే వారి సేవలను గుర్తించేందుకు పవన్ కళ్యాణ్ మూడు కొత్త విభాగాలను ప్రకటించారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని ఆశయాల కోసం పనిచేసే వారిని ‘ఉద్యమి’గా పిలుస్తారు. నవతరంలో ప్రేరణ కలిగించి సభ్యత్వ నమోదు చేసే వారిని ‘సాధక్’గా వ్యవహరిస్తారు. పార్టీ బలోపేతానికి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక, మేథోపరమైన సహకారం అందించే వారిని ‘ప్రదాత’గా గుర్తిస్తారు. భావజాలం ఉన్న వ్యక్తులే పార్టీకి అసలైన బలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీ ఎదుగుదలపై స్పందిస్తూ 150 మందితో ప్రయాణం మొదలైందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 2021లో మొదటి విడతలో 90 వేల సభ్యత్వాలు ఉండగా.. ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 12.98 లక్షలకు చేరుకోవడం విశేషం. కూలీ పనులు చేసుకునే వారి నుంచి వ్యాపారవేత్తల వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తో పాటు గతంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన కార్యకర్తలు పాల్గొన్నారు.



