– తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడకు ముప్పు పొంచి ఉందని ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి 4 యేండ్లు అయ్యాయని, కార్మికులు ఆకాంక్ష మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్నారు. సింగరేణిలో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సంస్థలో కార్మికులకు ఇచ్చే జనరల్ మజ్దూర్ పదోన్నతులకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు 6 కొత్త భూగర్భ గనులు, సొంతింటి పథకం, పేర్ల మార్పు, డిపెండెట్ల వయసు పెంపు, సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించడం లాంటి వాటిపై టీబీజీకేఎస్ మాట్లాడడం లేదన్నారు. యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రద్దు చేసి, స్టాట్యుటరీ కమిటీల్లో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తే ఎన్నికలు పెట్టమని అడగమన్నారు. గత నెల 30న ఓటర్ లీస్ట్ ఇవ్వాలనే ఆదేశాలను యాజమాన్యం పట్టించుకోకపోవడం పై కోర్టుకు పోతామని తెలిపారు. కార్మికుల వద్ద ఎన్నికలు నిర్వహించాలంటూ పలికే కొన్ని కార్మిక సంఘాలు ఆర్ఎల్సి ముందు జరిగే సమావేశంలో ఎందుకు పాల్గొనడంలేదో కార్మికులు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ముస్కె సమ్మయ్య, కె. వీరభద్రయ్య, తౌటం మల్లేష్, రాంచందర్, లచ్చన్న, లక్ష్మణ్, మురళీ చౌదరి, నవీన్ రెడ్డి, అప్రోజ్ ఖాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
131