- ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
- ఆర్.కె 6 ఎస్ఓఎం ఈ. తిరుపతి
ఆర్. కె న్యూస్, నస్పూర్: 1975వ సంవత్సరంలో ప్రారంభమైన రవీంద్రఖని 6 గని ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంటుందని, 50 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని గని ఎస్ఓఎం ఈ. తిరుపతి అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గని ఎస్ఓఎం మాట్లాడుతూ, ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ, ఆర్.కె 5,6 గ్రూప్ గనుల ఏజెంట్ ఎన్. శ్రీధర్ ల మార్గదర్శకత్వంలో ప్రమాద రహిత ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో ఏరియాలోని అన్ని గనులకు రవీంద్రఖని 6 గని ఆదర్శంగా నిలిచిన ఆర్.కె 6 గని ఈ ఏడాది ఆగస్టు మాసం వరకు నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం గనిలో 758 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ ఉద్యోగులు గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. పని స్థలాల్లో విధిగా రక్షణ పరికరాలు, రక్షణ సూత్రాలు పాటించాలన్నారు.గనిలో మొత్తం 29.80 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా ప్రస్తుతానికి 14.78 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీసినట్లు, ఇంకా 13.95 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. గనిలో జి–9, జి–12 గ్రేడ్ బొగ్గు ఉందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వంద శాతం పైగా ఉత్పత్తితో సింగరేణిలోనే ఉత్తమ గనిగా పేరు ఉందని, తెలిపారు. ఉత్పత్తితో పాటు 2024 సంత్సరంలో ప్రమాద రహిత భూగర్భ గనిగా నిలవడం గొప్ప విషయమని తెలిపారు. ప్రస్తుతానికి 106 శాతానికి పైగా ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గని సేఫ్టీ ఆఫీసర్ కె. శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ మర్రి కొమురయ్య, వెంటిలేషన్ ఆఫీసర్ ఆర్. రాం నర్సయ్య,సీనియర్ సర్వేయర్ ఎస్.పి వర్మ, వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్. సురేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.