ఆర్.కె న్యూస్, మంచిర్యాల: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాల హామీ పత్రాల కార్డులను సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్, హాజీపూర్ మండలం వేంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, త్రిపుర సీఎల్పీ నాయకుడు, సిడబ్ల్యుసి సభ్యులు సుదీప్ రాయ్ బర్మాన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియాగాంధీ ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు పథకాలను ప్రకటించారని తెలిపారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించిన అభయహస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం పథకాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్యులకు నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ పథకాన్ని రూపొందించినట్లు వారు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
230