ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రభుత్వ భూములలో గత ఏండ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారికి ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హత గల వారు సద్వినియోగం చేసుకొని యాజమాన్య హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న జి.ఓ. నం.59 క్రింద అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ విచారణ సర్వేను ప్రత్యేక అధికారి కె. చిన్నయ్యతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారికి అట్టి భూమిపై యాజమాన్య హక్కు కల్పిస్తూ ప్రభుత్వం అందించిన జి. ఓ. 59 సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తు చేసుకొని నోటీసు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పట్టా పొందాలని తెలిపారు. సామాన్యులకు అందుబాటు ధరలో ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం రుసుము నిర్ణయించడం జరిగిందని, ఇది ప్రజలకు సువర్ణ అవకాశం అని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
248