ఆర్.కె న్యూస్, కుమురంభీమ్ ఆసిఫాబాద్: గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, గర్భం దాల్చిన మహిళల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, గర్భిణులలో రిస్క్ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రక్తహీనత లోపం గల గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలను గుర్తించి వారికి సకాలంలో పోషకాహారం అందేలా న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు బాలింతలకు అందించే కేసిఆర్ కిట్ల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు అందించే పోషకాహారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహిళల సంక్షేమం దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
255