మానవ మెదడులో దాదాపు 100 బిలియన్ల నాడీ కణాలు,ఇతర కణాలు ఉంటాయి. ఈ కణాలు ఆలోచించడం, మాట్లాడటం, నేర్చుకోవడం, శరీర భాగాలను నియంత్రిస్తాయి. కానీ, వయస్సు పెరిగే కొద్దీ వృద్ధుల్లో జ్ఞాపక శక్తి నశించి మతిమరుపు లాంటి లక్షణాలు పెరుగుతాయి. సహజంగా మతిమరుపు వలన ఒక వస్తువు పెట్టిన చోటు మరవడం, బయటకు వెళ్లిన వారు తమ ఇంటి చిరునామా మరచి తికమక పడటం, తమకు తెలిసిన వారిని గుర్తుపట్టక పోవటం, పొంతన లేని సంభాషణ, తమకు తెలియకుండానే వ్యక్తుల మధ్య బట్టలు మార్చుకోవడం లాంటి చర్యలు చేబడుతుంటారు. ఇలాంటి వారిలో తీవ్రమైన గందరగోళం,నూతన పద్ధతులు నేర్చుకోవడంలో తడబాటు, చదవటం, వ్రాయటంలో అక్షరాలు మరచి పోవడం, ఒక్కోసారి విపరీత ధోరణితో ప్రవర్తిస్తారు.ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి “అల్జీమర్స్” మానసిక వ్యాధి ఉందని తెలుసుకోవాలి. అల్జీమర్స్ మొదటి కేసు 1901లో జర్మన్ మానసిక వైద్యుడు”అలోయుస్ అల్జీమర్” చేత 50 ఏళ్ల జర్మనీ మహిళలో నిర్ధారణ అయ్యింది. ఈ రుగ్మతకు “అలోయుస్ ఆల్జీమర్” అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులు 2.4 కోట్ల మంది ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 13.5 కోట్ల మంది గురై పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అల్జీమర్స్ ఉన్న దేశం ఫిన్ లాండ్. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 55 మంది అల్జీమర్స్ తో బాధ పడుతున్నారు. అల్జీమర్స్ తో బాధ పడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత తృతీయ స్థానంలో భారతదేశం ఉంది. ఈ వ్యాధి లక్షణం పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ. ప్రజల్లో అల్జీమర్స్ వ్యాధి పై అవగాహన పెంచేందుకు “అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్” వారు 1994లో ఎడన్ బర్గ్ లో “ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 21”న ప్రకటించారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా యుక్త వయస్సు నుంచే తగు జాగ్రత్తలు పాటించాలి. నీరు ఎక్కువగా త్రాగడం, ధూమపానం, మద్యపానం సేవించక ఉండటం, శారీరక వ్యాయామం చేయడం, ధ్యానం వంటివి చేయాలి.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్